బీజేపీకి ‘బల్దియా’ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

బీజేపీకి ‘బల్దియా’ పరీక్ష

Feb 3 2026 7:57 AM | Updated on Feb 3 2026 7:57 AM

బీజేప

బీజేపీకి ‘బల్దియా’ పరీక్ష

వరుస ఎన్నికల్లో విజయం మున్సి‘పోల్స్‌’ వేళ నేతల మధ్య సమన్వయ లోపం అభ్యర్థుల ఎంపికపై అభ్యంతరం ఎమ్మెల్యేలపైనే గెలుపు భారం

నిర్మల్‌: జిల్లాలో కనీస ప్రాతినిథ్యం లేని బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుస విజయాలను అందుకుంటూ వస్తోంది. వరుసగా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, పంచాయతీ ఎన్నికల్లో గెలిచింది. పోటీచేసేందుకు అభ్యర్థులు కూడా దొరకని స్థితి నుంచి ఇప్పుడు బీజేపీ సీటు కోసం పోటాపోటీ పడాల్సిన స్థాయికి చేరింది. ఇదంతా ఒకవైపు. ఇప్పుడు ఎదుర్కొంటున్న పురపోరు మరో ఎత్తు. మున్సిపోల్స్‌ ఆ పార్టీకి అంతా ఈజీగా కనిపించడం లేదు. నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మూడు బల్దియాల్లోనూ చైర్మన్‌ స్థానాలు దక్కించుకోవడం నల్లేరుమీద నడకేం కాదు. ఈ ఎన్నికలకు వచ్చేసరికి వార్డుల్లో సొంతపార్టీలోనే కుంపట్లు కనిపిస్తున్నాయి. వాటిని చల్లారుస్తూనే సీనియర్లను కలుపుకుంటూ ఓటర్లను ఆకట్టుకోవడం, పట్టణాల్లో పాగావేయడం బీజేపీకి పరీక్షే.

పోటాపోటీ పరిస్థితి..

‘అన్న.. మా పార్టీ నుంచి కౌన్సిలర్‌గా పోటీచేయండి. కచ్చితంగా గెలుస్తరు. ఖర్చులన్నీ మేమే చూసుకుంటాం..’ అని బీజేపీ సీనియర్‌ నేతలు అడిగితే.. ‘లేదన్న.. మీ పార్టీ నుంచి పోటీచేస్తే గెలువడం అటుంచి, డిపాజిట్‌ కూడా వస్తుందో లేదో వద్దన్న..’అని చెప్పేవారు. ఇది ఒకప్పటి పరిస్థితి. పదేళ్ల నుంచి క్రమంగా మారుతూ వస్తోంది. ఇప్పుడు కౌ న్సిలర్‌ టికెట్‌ కోసం పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఒక్కో వార్డు నుంచి నలుగురైదుగురు పోటీపడుతున్నారు. ఈ పోటీవాతావరణమే రేపొద్దున మున్సిపల్‌ ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని పార్టీ నేతలు కలవరపడుతున్నారు.

‘పట్టణ’పార్టీకి పరీక్షా సమయం..

అసెంబ్లీ, లోక్‌సభ, శాసనమండలి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన బీజేపీ ఇటీవల పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్‌కు పోటాపోటీగా పల్లెలను గెలుచుకుంది. ఇక ముందునుంచీ పట్టణాలకు పరిమితమైన పార్టీగా పేరున్న బీజేపీకి మున్సిపల్‌ ఎన్నికలు అసలైన సవాలుగా చెప్పవచ్చు. జిల్లాలోని కీలకమైన నిర్మల్‌, భైంసా మున్సిపాలిటీలు ఇద్దరు ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, రామారావుపటేల్‌, ఖానాపూర్‌ బల్దియా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రితేశ్‌రాథోడ్‌ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. తమ పరిధిలోని ఆయా మున్సిపాలిటీల్లో కాషాయజెండా ఎగురవేయించాల్సిన బాధ్యతను పార్టీ వారిపైనే పెట్టింది. వార్డుల్లో రెబల్స్‌ను తప్పించడం, సీనియర్లను సమన్వయం చేసుకుంటూ, అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ఎదుర్కొంటూ గెలుపుదిశగా పార్టీని తీసుకెళ్లడం పరీక్షగానే చెప్పవచ్చు.

సీనియర్లు కలిసొచ్చేనా..!

అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీలోనూ గ్రూపులు తయారయ్యాయి. ఎన్నికలకు ముందు పార్టీలో చేరి న నేతలు, వారి అనుచరులు ఓవైపు, పార్టీనే నమ్ముకుని ఉన్న సీనియర్లు మరోవైపు అన్నట్లుగా కొనసాగుతున్నారు. నిర్మల్‌, భైంసా మున్సిపాలిటీల్లో కౌన్సిలర్‌ టికెట్ల కేటాయింపుల్లో సీనియర్లను పరిగణనలోకి తీసుకోలేదన్న వాదన ఉంది. చాలామంది సీనియర్‌ నేతలూ ఈ విషయంపై బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నిర్మల్‌ మున్సిపాలిటీలో కొంతమంది సీనియర్లు తమ వార్డుల్లో టికెట్‌ ఇవ్వాలని అడిగితే, సంబంధం లేని వార్డుల్లో కేటాయించారు. దీనిపైనా సదరు అభ్యర్థులు అసంతృప్తితో ఉన్నట్లు పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి.

బీజేపీకి ‘బల్దియా’ పరీక్ష1
1/1

బీజేపీకి ‘బల్దియా’ పరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement