సమన్వయంతో ‘పంచాయతీ’ గెలుద్దాం
నిర్మల్/సారంగాపూర్: జిల్లాలో ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయాలని, సమన్వయంతో పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ నేతలను సర్పంచులుగా గెలిపించాలని డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జుపటేల్ అన్నారు. పదవిని చేపట్టిన తర్వాత తొలిసారి ముఖ్యనేతలతో కలిసి జిల్లాకేంద్రంలో సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కులమతాలకు అతీతంగా, ఎలాంటి వైషమ్యాలు లేకుండా ముందుకు పోతుందన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం కోసం కలిసికట్టుగా కృషిచేద్దామని అన్నారు.
బీసీలకు ప్రాధాన్యత..
జనరల్ స్థానాల్లో జనాభాను బట్టి బీసీ అభ్యర్థులకు ప్రాధాన్యతనివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారని బొజ్జు పేర్కొన్నారు. జిల్లాలోనూ అలాంటి స్థానాల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చేలా నియోజకవర్గ ఇన్‌చార్జీలు చూడాలని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేసేందుకు ఈనెల 4న సీఎం రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్‌కు వస్తున్నారని తెలిపారు. కార్యక్రమాన్ని జిల్లా నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జిల్లాకేంద్రంలో కార్యాల యం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈసందర్భంగా డీసీసీ మాజీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు బొజ్జుపటేల్‌ను సన్మానించారు. సమావేశంలో గ్రంథాలయసంస్థ జిల్లా చైర్మన్ అర్జుమంద్‌అలీ, ఏఎంసీ చైర్మన్ భీంరెడ్డి, ఎఫ్‌ఎస్‌సీఎస్ చైర్మన్ ధర్మాజీగారి రాజేందర్, పీసీసీ ప్రధానకార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సమరసింహారెడ్డి, సీనియర్ నేతలు పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, నాందేడపు చిన్ను, జునైద్ తదితరులు పాల్గొన్నారు.


