
‘బీసీలపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు’
నర్సాపూర్ (జీ): బీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదని డీసీసీ అధ్యక్షు డు కూచాడి శ్రీహరిరావు ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. శనివారం బీసీ జేఏసీ తలపెట్టిన బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తోందని తెలిపారు. బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చే పట్టి బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపినట్లు తెలిపారు. ఈ బిల్లుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతూ కాంగ్రెస్‌పైనే బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బీసీ బిల్లుపై ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని, బీజేపీకి తగిన బుద్ధి చెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ, నిర్మల్, భైంసా ఏఎంసీ చైర్మన్లు సోమ భీమ్‌రెడ్డి, ఆనంద్‌రావుపటేల్, మాజీ ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ జుట్టు అశోక్, నాయకుడు గడ్డం ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.