దావత్‌ ఉందా..? | - | Sakshi
Sakshi News home page

దావత్‌ ఉందా..?

Oct 2 2025 7:55 AM | Updated on Oct 2 2025 7:55 AM

దావత్‌ ఉందా..?

దావత్‌ ఉందా..?

● ఆశావహులకు దసరా పరేషాన్‌ ● పెరుగుతున్న అనుచరుల ఒత్తిడి ● 8న హైకోర్టు ఏం చెబుతుందో..! ● అయోమయంలో పోటీదారులు

నిర్మల్‌: ‘ఏమే.. నర్సన్న ఎట్లన్న రిజర్వేషన్‌ నీదిక్కే అచ్చే. ఇంకేమున్నదే గెల్సుడు కూడా నువ్వే గెలుస్తవ్‌. సప్పుడుదాకా దసరా పండుక్కు మనోళ్లందరికీ దావతిచ్చెయ్యే..’ అని దగ్గరోళ్లు అడుగుతుంటే ఆశావహులు మాత్రం ఎటూ చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారైనా, ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినా.. ఇంకా డైలామాలోనే ఉన్నారు. ఈనెల 8న హైకోర్టు ఇచ్చే తీర్పు ఎట్లుంటదో, ఈ ఎన్నికలు కొనసాగుతాయా.. లేక వాయిదా వేస్తారా..? అన్న కోణంలో ఆశావహులు ఆలోచిస్తున్నారు. రిజర్వేషన్‌ కలిసొచ్చినా.. పార్టీ తననే నిలబెడుతుందా.. లేక ఇంకొకరికి సీటిస్తుందా..? అన్న సందేహంతో ఉన్నవాళ్లూ పండుగ దావత్‌లకు ఇంకా పచ్చజెండా ఊపడం లేదు. ‘సర్పంచో, ఎంపీటీసో.. ఏదైతేమున్నది..! ముందైతే అందరినీ తనవైపు తిప్పుకుందాం..’ అనుకునే ఆశావహులు మా త్రమే దసరా దావత్‌ల ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

8న ఏం తేలుతుందో!

రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల రి జర్వేషన్లు ఖరారు చేసింది. షెడ్యూల్‌ కూడా ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్‌ను మాత్రం ఈనెల 9న ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇందుకు బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉండటం, దీనిపై ఈనెల 8న తీర్పు వెలువడనుండమే కారణం. తీర్పు ఎలా ఉంటుందో.. ఏం వస్తుందో.. తెలియదు. బీసీ రిజర్వేషన్లకు తామంతా మద్దతిస్తున్నామని చెబుతున్న ప్రతిపక్షాలు రాజ్యాంగ విరుద్ధంగా రిజర్వేషన్ల ప్రక్రియ తేలకుండా ఎలా ఎన్నికలకు వెళ్తారు? లాంటి ప్రశ్నలూ వే స్తున్నాయి. ఇవి కూడా ఆశావహులను గందరగోళంలో పెడుతున్నాయి.

అడగడమా.. ఆగడమా..!?

హైకోర్టు తీర్పు వచ్చే దాకా ఆగడమా.. లేక ఇప్పటి నుంచే తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలంటూ పార్టీలను అడగడమా.. అనే అంశాన్నీ ఆశావహులు తేల్చుకోలేకపోతున్నారు. రిజర్వేషన్‌ అనుకూలంగా వచ్చినచోట ఇప్పటికే ఈసారి తమకే చాన్స్‌ అంటూ చాలామంది ప్రచారం చేసుకుంటున్నారు. తమ బలగం పెంచుకునేందుకు, అన్నివర్గాల మద్దతు ద క్కించుకునేందుకు ప్రయత్నాలూ మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే దసరాకు చాలాచోట్ల దావత్‌లకూ ప్లాన్‌ చేసి పెట్టుకున్నారు. కానీ.. ఎక్కడో ఒకచోట కోర్టు తీర్పు ఎలా వస్తుందో.. ఇదే రిజర్వేషన్‌ ఉంటుందో, ఉండదో.. లేక ఎన్నికలే వాయిదా పడతాయేమో.. అన్న అనుమానాలు ఆశావహులను ఇబ్బంది పెడుతున్నాయి.

దావతైతే ఇచ్చేద్దాం

జెడ్పీటీసీ, సర్పంచ్‌, ఎంపీటీసీ స్థానాల కోసం పోటీ పడాలనుకునే ఆశావహులకు రిజర్వేషన్ల ఖరారు నుంచే తమ మద్దతుదారుల ఒత్తిడి పెరుగుతోంది. ‘అన్నా.. ఈసారి పండుగకు ఊళ్లె మనమే చూసుకోవాల్నె..’ అంటూ వెంటపడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ‘పోయిపోయి.. ఈ ప్రకటన దసరా పండుగప్పుడే అచ్చే.. ఇగ ఊళ్లె ఆగుతరా..! పెద్దరికానికన్నా దావతియ్యవడతది..’ అంటూ చాలామంది నేతలు, నాయకులు, ఆశావహులు దసరాకు సిద్ధమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement