
అమలులో ‘స్థానిక’ ఎన్నికల కోడ్
నిర్మల్‌చైన్‌గేట్: స్థానిక సంస్థల ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించగా సోమవారం నుంచి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణపై మీడియాతో మాట్లాడారు.
జిల్లాలో 4,49,302 మంది ఓటర్లు
జిల్లాలో 4,49,302 మంది ఓటర్లుండగా, ఇందులో 2,13,805 మంది పురుషులు, 2,35,485 మంది మహిళలున్నారు. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలకు 3,368 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 482 పోలింగ్ లొకేషన్లున్నాయి. ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ బాక్స్‌లు, పోలింగ్ సిబ్బంది, స్టే జ్–1, స్టేజ్–2 అధికారులకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆర్వో, పీవో శిక్షణ కార్యక్రమాలు మండలాలవారీగా చేపట్టారు. బ్యాలెట్లు ప్రచురించే విషయంలో ప్రింటింగ్ ప్రెస్‌లు పూర్తి వివరాలు ప్రదర్శించారని అధికారులు తెలిపారు.
కొత్త పనులకు బ్రేక్
స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటనతో జిల్లాలో కొత్త పనులు అమలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వపరంగా ఎలాంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడానికి వీలులేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే అమలులో ఉన్న పాత పథకాలు, పనులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని వివరించారు. రూ.50 వేలకు మించి తీసుకెళ్తే తప్పనిసరిగా సంబంధిత పత్రాలు చూపాలని సూచించారు. జిల్లాలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే ఏ సమావేశం, ర్యాలీకై నా ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, మీడియాలో వచ్చే పెయిడ్ ఆర్టికల్స్‌పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.