
వన్యప్రాణుల సంరక్షణ.. అందరి బాధ్యత
సారంగపూర్: వన్యప్రాణుల సంరక్షణ.. అందరి బాధ్యత అని అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ శరవణన్ సూచించారు. మండలంలోని చించోలి(బీ) గ్రామ సమీపంలోగల గండిరామన్న హరితవనంలో బుధవారం వన్యప్రాణి సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం హరితవనంలో విద్యార్థులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవి జంతులవులతోనే అటవీ రక్షణ సాధ్యపడుతుందని తెలిపారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం అడవి జంతువులను వేటాడి తినడంతో జీవవైవిధ్యంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ కారణంగా వన్యప్రాణులు ఆహా రం కోసం గ్రామాల్లోకి చొరబడే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి సంరక్షిస్తే ప్రకృతి విపత్తులనుంచి బయటపడే అవకాశముందని, మానవ మనుగడకు నష్టం జరగదని పేర్కొన్నారు. ఎఫ్‌డీవో నాగిణీభాను, ఎఫ్‌ఆర్వోలు రామకృష్ణ, వేణుగోపాల్, శ్రీనివాసరావు, రమేశ్ రాథోడ్, డీఆర్వోలు నజీర్‌ఖాన్, సంతోష్, రాజేశ్వర్, ఇర్ఫాన్, అటవీశాఖ సిబ్బంది ఉన్నారు.