
రైతుల కష్టం వరదపాలు
అధిక వర్షాలకు మొలకెత్తిన మొక్కజొన్నలు ఆరబెట్టేందుకు నానా తిప్పలు సోయా, పత్తి పంటలదీ అదే పరిస్థితి పంటల దిగుబడిపై సన్నగిల్లుతున్న ఆశలు
ఈచిత్రంలో కనిపిస్తున్న రైతు లోకేశ్వరం మండలంలోని పంచగుడి గ్రామానికి చెందిన భోజన్న. ఈ ఏడాది తనకున్న రెండెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. ఇటీవలే పంట కోత దశకు వచ్చింది. కంకులను కోసి రోడ్డుపై ఆరబెట్టాడు. ఇటీవల ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు మొక్కజొన్న కంకులకు మొలకలు వచ్చాయి. దీంతో పంట దిగుబడి రావడం గగనంగా మారిందని రైతు ఆవేదన చెందుతున్నాడు. ఈ ఒక్క రైతుదే కాదు జిల్లాలోని చాలామంది అన్నదాతలదీ ఇదే పరిస్థితి.
లోకేశ్వరం: అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు ఇంటికి వచ్చేంత వరకు నమ్మకం లేకుండా పోతోంది. విత్తనం విత్తింది మొదలు ప్రకృతి పగబట్టినట్లు వెంటాడుతూనే ఉంది. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జిల్లాలో సాగు చేసిన పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. జిల్లాలో ఈ ఏడాది వానాకాలం 4.30 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. మొదట్లో ఆశించిన మేర వర్షాలు కురియకపోవడంతో పంటల్లో ఎదుగుదల లోపించింది. తీరా పంట దిగుబడి చేతికి వచ్చే సమయంలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట చేలలోనే సోయా, పత్తి కాయలకు మొలకలు వస్తున్నాయి. కోతకు వచ్చిన మొక్కజొన్న కంకులు తడిసిపోవడంతో మొలకలు వస్తున్నాయి. ఆయా గ్రామాల్లోని ప్రధానరోడ్లపై ఆరబోసిన కంకులు సైతం ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు తడారక మొలకలు వస్తుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
అంతర పంటగా మొక్కజొన్న ..
పసుపులో అంతర పంటగా మొక్కజొన్న సాగు చేస్తారు. వర్షాలకు పంటచేలలో నీరు నిలవడంతో తేమ ఆరిపోయేంత వరకు మొక్కజొన్నను కోయలేని పరిస్థితి. ఇదే జరిగితే మొక్కజొన్న పసుపు పై పడిపోయి పంట దెబ్బతినే ప్రమాదం ఉంది. కోసిన కంకులను కుప్పగా పోస్తే వర్షానికి నాని మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇటీవల కురుస్తున్న వర్షాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
మార్కెట్‌లో డిమాండ్ ఉన్నా..
మొక్కజొన్న పంటకు మార్కెట్‌లో మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2400లు ఉండగా ఓపెన్ మార్కెట్‌లో రూ.2,800 నుంచి రూ.3000ల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాదిలో తొలిదశ కత్తెర పురుగు, గింజదశలో కోతులు, రామచిలుకలు, అడవి పందులు దెబ్బతీశాయి. ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా కేవలం 15 నుంచి 20 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.
జిల్లాలో సాగు వివరాలు
పంట ఎకరాల్లో
మొక్కజొన్న 15,371
వరి 1.40 లక్షలు
పత్తి 1.57 లక్షలు
సోయా 40,000

రైతుల కష్టం వరదపాలు