
సద్దుల సందడి
అమ్మ సన్నిధిలో భక్తజనం
చదువుల తల్లి సరస్వతీ అమ్మవారిని అత్యంత ప్రీతిపాత్రమైన మూలనక్షత్ర శుభఘడియల్లో దర్శించుకునేందుకు రాష్టం నలుమూలల నుంచి భక్తులు సోమవారం అధికసంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి సన్నిధిలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు చేయించారు. ఈ సందర్భంగా సరస్వతీ అమ్మవారు మహాగౌరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సోమవారం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా అధికారులు, పట్టణ ప్రాంత మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చారు. కలెక్టర్ అభిలాష అభినవ్ ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మల వద్ద పూజలు చేశారు. అధికారులు, పట్టణ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. అనంతరం స్థానిక ధర్మసాగర్ చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. – నిర్మల్‌చైన్‌గేట్