
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
ఖానాపూర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటే ల్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో లేని అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. ఊరూరా రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో గ్రామాల్లో పనుల జాతర జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వ పథకాలే పార్టీ అభ్యర్థుల గెలుపునకు నాంది అవుతాయని, పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేసి అభ్యర్థుల గెలుపులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను రెండో విడతలో ఖానాపూర్‌లో ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, ఆయా మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.