
పండుగ చేసుకునేదెలా?
లక్ష్మణచాంద: బతుకమ్మ, దసరా తెలంగాణ ప్రజల కు పెద్ద పండుగ. ఈ పండుగను అందరూ ఘనంగా జరుపుకుంటారు. అయితే పల్లె ప్రజలకు ఏడాది పొడుగునా ఉపాధి కల్పించి, వారు చేపట్టే పనుల ను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేస్తూ, సకా లంలో వేతనాలు అందేలా చేయడంలో వివిధ స్థా యిల సిబ్బంది నిరంతరం విధులు నిర్వహిస్తున్నా రు. అయితే, సిబ్బందికి మాత్రం రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో పండుగ వేళ ఇబ్బంది పడుతున్నారు. వివిధ స్థాయిలలో పని చేస్తున్న క్షేత్ర సహాయకుల(ఎఫ్‌ఏలు)కు జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన వేతనాలు ఇంకా అందలేదు. టీఏలు, టీసీలు, ఏపీవోలకు ఆగస్టు నెలకు సంబంధించిన వేతనం రావాల్సి ఉంది. మూడవ నెల చివరికి వచ్చినా నెలనెలా రావాల్సిన వేతనాలు అందకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పండుగకు పస్తులేనా?
హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి. దసరా పండుగ వచ్చేసరికి ధనిక, పేద, మధ్యతరగతి అనే తేడా లేకుండా, ఎవరి ఆర్థిక స్థోమతకు తగినట్లుగా కుటుంబ సభ్యులకు కొత్త బట్టలు కొనుగోలు చేసుకుంటారు. కానీ, ఉపాధి హామీ పథకంలోని సిబ్బందికి వేతనాలు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు.
జిల్లాలో 373 మంది సిబ్బంది
జిల్లాలోని 18 మండలాల పరిధిలో జాతీయ గ్రామీ ణ ఉపాధి హామీ పథకంలో 12 మంది ఏపీవోలు, 5 మంది ఈసీలు, 38 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 72 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 207 మంది క్షేత్ర సహాయకులు, 18 మంది ఆఫీస్ సబార్డినేట్లు, 21 మంది డీఆర్డీఏ కార్యాలయ సిబ్బంది ఇలా మొత్తం 373 మంది విధులు నిర్వహిస్తున్నారు.
పంచాయతీ కార్మికులదీ ఇదే పరిస్థితి..
గ్రామాలను స్వచ్ఛంగా ఉంచడంలో పంచాయతీ కార్మికుల పాత్ర వెలకట్టలేనిది. జిల్లాలో పని చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా రెండు నెలలుగా వేతనాలు రావడం లేదు. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన వేతనాలు ఇప్పటి వరకు రాలేదని, దీంతో దసరా పండుగను ఎలా జరుపుకోవాలని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 400 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 1,520 మంది కార్మికులు పని చేస్తున్నారు. వేతనాలు రాకపోతే పండుగకు పస్తులు ఉండాల్సి వస్తుందని కార్మికులు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి వేతనాలు విడుదల చేయాలని పంచాయతీ కార్మికులు కోరుతున్నారు.
ప్రభుత్వానికి నివేదించాం
జిల్లాలోని 400 గ్రామ పంచాయతీల కార్మికులకు జూలై, ఆగస్టు నెలల వేతనాల కోసం ఇది వరకే ప్రభుత్వంకు నివేధించాం. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే ఖాతాల్లో జమ చేస్తాం. – శ్రీనివాస్, డీపీవో, నిర్మల్
ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది
ఉపాధి హామీ సిబ్బంది వేతనాలు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ప్రభుత్వం విడుదల చేయగానే వారివారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. – నాగవర్ధన్, ఏపీడీ ఉపాధిహామీ పథకం

పండుగ చేసుకునేదెలా?