
‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ఖరారుకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం లక్కీ డ్రా నిర్వహించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, జనరల్ రిజర్వేషన్లు ఖరారు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పూర్తిస్థాయి పారదర్శకతతో రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టామన్నారు. జిల్లాలోని 18 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లను 2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ వాటాలను నిర్ణయించగా, బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం కేటాయించామన్నారు. మొత్తం ప్రక్రియ వీడియో రికార్డింగ్ మధ్యన, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేపట్టామని తెలిపారు. ఈ లక్కీడ్రా కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్‌అహ్మద్, భైంసా సబ్‌కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్, డిప్యూటీ సీఈవో శంకర్ తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ పీఠం బీసీలదే
జిల్లాపరిషత్ పీఠాల రిజర్వేషన్లను పంచాయతీరాజ్ రూరల్ ఎంపవర్మెంట్ శాఖ శనివారం విడుదల చేసింది. నిర్మల్ జెడ్పీ పీఠం ఈసారి బీసీలకే దక్కనుంది. బీసీ(పురుష/మహిళ)కు రిజర్వు చేస్తూ పంచాయతీరాజ్ రూరల్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ అండ్ స్టేట్ ఎలక్షన్ అథారిటీ జి.శ్రీజన ఉత్తర్వులు జారీ చేశారు. 2019 నుంచి 2024 వరకు నిర్మల్ జెడ్పీ పీఠం జనరల్ మహిళకు కేటాయించారు. ఈసారీ బీసీలకు అవకాశం దక్కనుంది.