
ఎలుగుబంట్ల దాడిలో రైతులకు గాయాలు
నెన్నెల: మండలంలోని మైలారం గ్రామ శివారులో గురువారం మూడు ఎలుగుబంట్లు దాడి చేయడంతో దుబ్బపల్లి గ్రామానికి చెందిన అర్శ మారయ్య, గావిడి మల్లేశ్ అనే గిరిజన రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. సదరు రైతులు మధ్యాహ్నం గ్రామ శివారులోని పత్తి చేన్లకు వెళ్తుండగా మూడు ఎలుగుబంట్లు అకస్మాత్తుగా వచ్చి దాడి చేశాయి. తీవ్రగాయాలు కావడంతో బాధిత కుటుంబ సభ్యులు వెంటనే 108లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యంకోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.