
కోచింగ్ లేకుండానే..
భైంసాటౌన్: భైంసాకు చెందిన సుర్వే సాయికుమార్ ఎలాంటి కోచింగ్ లేకుండానే గ్రూప్–1కు ఎంపికయ్యాడు. లోకేశ్వరం మండలం పొట్‌పల్లికి చెందిన సిద్దేశ్వర్, రత్నమాల దంపతులు ఉపాధి నిమిత్తం భైంసాలోని పిప్రికాలనీలో నివాసముంటున్నారు. వారి కుమారుడు సాయికుమార్ పదో తరగతి వరకు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివాడు. ఇంటర్ హైదరాబాద్‌లోని కార్పొరేట్ కళాశాలలో పూర్తి చేశాడు. అనంతరం తిరుచ్చిలోని ఎన్‌ఐటీలో ర్యాంకు రావడంతో బీటెక్ పూర్తి చేసి, ఢిల్లీలోని మారుతి సుజుకి మానుఫ్యాక్చర్ ప్లాంట్‌లో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో ఐఏఎస్ కావాలని నిర్ణయించుకున్నాడు. మెకానికల్ ఇంజినీరింగ్ ఉద్యోగం వదిలేసి సన్నద్ధమయ్యాడు. గతంలో గ్రూప్–3 పరీక్షకు ఎంపిక కాగా, తాజాగా గ్రూప్–1లోనూ 157 ర్యాంకు సాధించి బీసీ వెల్ఫేర్ అధికారి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. సాయికుమార్ ఇదివరకే యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఉత్తీర్ణత సాధించి, మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యాడు. ప్రస్తుతం వాటి ఫలితాల కోసం వేచి చూస్తున్నారు.