
పోటెత్తిన గోదావరి
ఎగువ నుంచి భారీగా వరద..
జిల్లా అంతటా మోస్తరు వాన
సోయా పంటకు తీవ్ర నష్టం
మురుగుతున్న పత్తి కాయలు
భైంసా: ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే గోదావరినది, భారీ వరదతో పరీవాహక ప్రాంతాలను ముంచెత్తుతోంది. వరుస వర్షాలతో నీరు నిలిచి, పంటలు మునిగిపోతున్నాయి. బాసర, లోకేశ్వరం, దిలావర్‌పూర్, భైంసా, కుంటాల మండలాల్లోని గడ్డెన్న వాగు ప్రాజెక్టు పరిధిలో ముంపు సమస్య రైతులను వేధిస్తోంది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో గోదావరి, మంజీర నదుల్లో ప్రవాహం పెరిగి, జిల్లాలో వేలాది ఎకరాల పంటలు నీటిలో మునిగాయి. నెల రోజులుగా ఈ సమస్య కొనసాగుతోంది.
సోయా, పత్తి పంటలకు నష్టం..
జిల్లాలో సోయాబీన్ పంట నీటిలో మునిగి దెబ్బతింటోంది. ఎడతెరిపి లేని వర్షాలతో పంట కోతకు అనువైన పరిస్థితి కనిపించడం లేదు. వర్షం తగ్గితే పంట కోసుకోవాలని రైతులు ఎదురుచూస్తున్నారు, కానీ వాతావరణం సహకరించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పత్తి కాయలు నీటిలో మునిగి మురిగిపోతున్నాయి. భారీ వర్షాలతో పత్తి ఆకులు ఎరుపురంగుకు మారాయి. భూమిలో తేమ శాతం అధికంగా ఉండటంతో పంటను కాపాడటం రైతులకు కష్టసాధ్యంగా మారింది. సాధారణంగా దసరా నాటికి చేతికొచ్చే పత్తి పంట, ఈ ఏడాది వర్షాలతో నీటిలోనే కుళ్లిపోతోంది.
జనజీవనం అస్తవ్యస్తం..
గోదావరి ఉప్పొంగడంతో జిల్లావ్యాప్తంగా అనేక ఇబ్బందులు తలెత్తాయి. బాసరలో నవరాత్రి ఉత్సవాలకు వచ్చిన భక్తులు రోడ్లపై నిలిచిన నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని దుర్గమ్మ మండపాల వద్ద కూడా వర్షం కారణంగా భక్తులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వర్షం తగ్గితేనే పరిస్థితి కొంత మెరుగవుతుందని స్థానికులు ఆశిస్తున్నారు.
జిల్లాకు ఎల్లో అలర్ట్..
గురువారం ఉదయం నుంచి నిర్మల్ జిల్లాలో వర్షం కురుస్తోంది. మరో రెండు రోజులు వర్షాలు కొనసాగే అవకాశముంది. వాతావరణ శాఖ జిల్లాకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. జిల్లాలోని వాగులు ఉప్పొంగుతున్నాయి. కలెక్టర్ అభిలాష అభినవ్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్‌కుమార్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జిల్లాలో నమోదైన వర్షపాతం..
గురువారం కుభీర్‌లో 3 మి.మీలు, బాసరలో 2.2, ముధోల్‌లో 3.4, భైంసాలో 3.6, కుంటాలలో 7.2, నర్సాపూర్(జి)లో 11.0, లోకేశ్వరంలో 4.2, దిలావర్‌పూర్‌లో 11.2, సారంగాపూర్‌లో 12.0, నిర్మల్‌లో 8.6, నిర్మల్ రూరల్‌లో 9.8, సోన్‌లో 9.4, లక్ష్మణచాందలో 8.2, మామడలో 14.2, పెంబిలో 8.6, ఖానాపూర్‌లో 12.6, కడెం పెద్దూర్‌లో 11.2, దస్తు రాబాద్‌లో 18.2 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది.

పోటెత్తిన గోదావరి