
పీఎం జన్‌మన్ పనులు త్వరగా పూర్తి చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్:పీఎం జన్‌మన్ కార్యక్రమంలోని చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలని కేంద్ర గిరి జన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి విభూ నాయర్ కలెక్టర్లను ఆదేశించారు. పీఎం జన్‌మన్ కార్యక్రమం అమలుపై ఢిల్లీలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం కలెక్టర్లతో సమీక్ష చేశారు. గిరిజన ప్రజల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పీఎం జన్‌మన్ కింద ఆధార్ కార్డుల నమోదు, ఆయుష్ కార్డులు, జన్‌ధన్ ఖాతాల వినియోగం, పక్కా గృహాల నిర్మాణం, పీఎం కిసాన్, కిసాన్ క్రెడిట్ కార్డులు, మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలను కలెక్టర్లు పర్యవేక్షిస్తూ వేగవంతం చేయాలన్నారు. ఆది కర్మయోగి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులతో మాట్లాడారు. పీఎం జుగా, దర్తిఅబా, ఆదికర్మయోగి కార్యక్రమాల్లోని పనులు గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. అర్హులను గుర్తించేందుకు పంచాయతీ కార్యదర్శులు సర్వే చేసి వివరాలను యాప్‌లో నమోదు చేయాలన్నారు. జిల్లాలోని 24 హాబిటేషన్లలో 771 పక్కా గృహాలు నిర్మించనున్న ట్లు తెలిపారు. ఆది కర్మయోగి కింద 9 బ్లాకులు, 32 హాబిటేషన్లలో గిరిజన ప్రజల అభివృద్ధి కోసం ఐదేళ్ల ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామన్నారు. ఆది సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి గిరిజన సమాజానికి నూతన అంగన్‌వాడీలు, వసతి గృహాలు, మల్టీ పర్పస్ సెంటర్లు, ప్రైమరీ పాఠశాలలు, రోడ్డు కనెక్టివిటీ వంటి మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
బ్యాంకులు మెరుగైన సేవలు అందించాలి
నిర్మల్‌చైన్‌గేట్: బ్యాంకులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మొదటి త్రైమాసిక జిల్లా కన్సాలిటేటివ్ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ప్రజలకు ఇప్పటివరకు అందజేసిన రుణాల వివరాలు, వివిధ అంశాలపై సమీక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ రుణ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి బ్యాంకర్లు, అధికారులు కలిసి పనిచేయాలన్నారు. వెనుకబడిన తరగతుల ప్రజలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతులు, వీధి వ్యాపారులు, విద్యార్థులకు రుణ మంజూరులో ఆలస్యం చేయొద్దని కోరారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్‌గోపాల్, నాబార్డు డీడీఎం వీరభద్రుడు, ఆర్బీఐ ఏజీఎం శ్రీనివాస్, అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.
మార్క్ అవుట్ పూర్తి చేయాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనుమతి పొందిన ప్రతీ ఇంటికి సంబంధించిన మార్క్ అవుట్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పనులు నిరంతరంగా కొనసాగాలన్నారు. మార్క్ అవుట్, బేస్‌మెంట్ దశలు పూర్తయిన ఇళ్ల వివరా లు వెబ్‌సైట్‌లో నమోదు చేయాలన్నారు. అవసరమైన మ్యాన్‌పవర్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుల ఎంపిక సర్వేను పూర్తి చేయాలని తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల సర్వేను ఎంపీడీవోలు పర్యవేక్షించాలన్నారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, హౌసింగ్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.