జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు గ్రూప్–1 పరీక్షలో అసాధారణ విజయం సాధించి, కలల కొలువును సొంతం చేసుకున్నారు. ఏళ్ల తరబడి కఠిన శ్రమ, అనేక అడ్డంకులను అధిగమించి, లక్ష్యం వైపు అడుగులు వేశారు. వీరి పట్టుదల వారిని విజేతలుగా నిలిపింది. విశ్రాంతి లేకుండా కృషి చేసి, చివరకు తమ స్వప్నాన్ని నిజం చేసుకున్న ఈ యువకులు అనేక మందికి స్ఫూర్తిగా నిలిచారు.
భైంసారూరల్: చిన్నతనం నుంచి కష్టపడి చదివి గ్రూప్–1 ఉద్యోగాన్ని సాధించాడు భైంసా రూరల్ మండలం వానల్‌పాడ్ గ్రామానికి చెందిన కర్రం సంపత్‌రెడ్డి. గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి–అమృత దంపతులకు ఇద్దరు సంతానం. శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయం చేస్తూ భార్య అమృత బీడీలు చుడుతూ ఇద్దరు పిల్లలను చదివించారు. సంపత్‌రెడ్డి 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు వానల్‌పాడ్‌లో చదువుకున్నాడు.
8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధన్, ఇంటర్మీడియెట్, డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. డిగ్రీ పూర్తయ్యాక 2022 నుంచి ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ ప్రారంభించాడు. గత ఏడాది గ్రూప్–4లో ప్రతిభ కనబర్చి విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తాజాగా గ్రూప్–1 ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 59వ ర్యాంకు సాధించాడు. డీఎస్పీగా కొలువు దక్కించుకున్నాడు. సివిల్స్ లక్ష్యం అని తెలిపాడు.