
సైబర్ నేరాలపై అవగాహన ఉండాలి
నిర్మల్‌టౌన్: టెలికాం వినియోగదారులు, సామాన్య ప్రజలు, విద్యార్థులు ప్రతి ఒక్కరికీ సైబర్ నేరాలపై అవగాహన ఉండాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కాగ్ సభ్యుడు రావూరి ప్రభాకర్‌రావు అన్నారు. టెలికాం, సైబర్ నేరాలపై జిల్లా కేంద్రంలోని వశిష్ఠ డిగ్రీ కళాశాలలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టెలికాం వినియోగదారుల హక్కుల కోసం భారత ప్రభుత్వం 1997లో ట్రాయ్ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. అవాంఛిత మొబైల్ కాల్స్ నియంత్రణ కోసం ట్రాయ్ 1909 నంబర్ కేటాయించిందని పేర్కొన్నారు. టెలి మార్కెటింగ్ కాల్స్ ని అడ్డుకోవడానికి డీఎన్డీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అందరూ బ్రాడ్ బాండ్ వినియోగించేలా దేశ వ్యాప్తంగా 7 లక్షల గ్రామాలకు సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్ ఎస్డీఈ గోవింద్, ఏఎఫ్‌వో రమణ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అఖిలేశ్‌కుమార్‌సింగ్, టెలికాం కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.