
శరణు.. శరణు దేవీ!
ఆదిలాబాద్: అమ్మవారి ఆగమనానికి సర్వం సిద్ధమైంది. ఆది పరాశక్తిని నవరాత్రుల్లో కొలిచేందుకు భక్తులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మండపాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. దేవి శరన్నవరాత్రి వేడుకలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మవారి మూర్తులు తుదిరూపం దిద్దుకుంటున్నాయి.
శరన్నవరాత్రులు పేరెలా..?
ప్రతీ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు మహార్నవమి వరకు దేవీ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులుగా పిలుస్తారు. ఈ మాసం నుంచి వర్ష ఋతువు వెళ్లి, శరత్ ఋతువు ప్రారంభమవుతుంది. దీంతో శరన్నవరాత్రులుగా వ్యవహరిస్తారు. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం ప్రారంభమవుతుంది. ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా పరిశుభ్రంగా ఉంటే ఎలాంటి అంటువ్యాధులు దరిచేరవని భక్తుల నమ్మకం.
11 రోజులు.. 11 రూపాలు
ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకు ఒక్క రూపంలో దర్శనం ఇవ్వనున్నారు. మొదటిరోజు ఈనెల 22న బాల త్రిపుర సుందరి దేవిగా, 23న శ్రీ గాయత్రి దేవిగా, 24న శ్రీ అన్నపూర్ణ మాతగా 25న కాత్యాయనీ దేవిగా, 26న శ్రీ మహాలక్ష్మి దేవిగా, 27న శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా, 28న శ్రీ మహా చండీ దేవిగా, 29న సరస్వతి దేవిగా, 30న దుర్గాదేవిగా దర్శనమిస్తారు. అక్టోబర్ 1న మహిషాసుర మర్దిని దేవి, 2న రాజరాజేశ్వర దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు.