
పండుగల దృష్ట్యా ప్రత్యేక రైళ్లు
కాగజ్‌నగర్‌టౌన్: దసరా, దీపావళి పండుగల దృష్ట్యా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున మూడు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రెయిన్ నం. 03253 పాట్నా– చర్లపల్లి, సోమ, బుధవారాల్లో, అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు, ట్రెయిన్ నం. 07255 చర్లపల్లి –పాట్నా, వారానికి ఒక్క రోజు (బుధవారం), అక్టోబర్ 3 నుంచి జనవరి 1 వరకు, ట్రెయిన్ నం. 07256 చర్లపల్లి –పాట్నా, శుక్రవారం, అక్టోబర్ 3 నుంచి జనవరి 2 వరకు నడుస్తాయని, ఈ రైళ్లకు కాజిపేట్, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుందని తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
భక్తుల పాదయాత్ర
బాసర: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఒకరోజు ముందుగానే మహారాష్ట్రలోని నాందేడ్, పర్బని, ఔరంగాబాద్, నాసిక్ జిల్లాలకు చెందిన భక్తులు పాదయాత్రగా వచ్చి ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. ఆలయ ముఖ్య అర్చకులు బాలకృష్ణ చేతుల మీదుగా అఖండజ్యోతిని వెలిగించుకుని బాసర నుంచి మహారాష్ట్రకు పాదయాత్రగా తరలివెళ్లారు. గత కొన్నేళ్లుగా జ్యోతితో పాదయాత్ర చేయడం ఆనవాయితీగా వస్తోందని భక్తుడు గణేశ్ తెలిపారు.
స్నూకర్ కేంద్రాలపై పోలీసుల దాడి
ఇంద్రవెల్లి: మండలకేంద్రంలో ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్న స్నూకర్ కేంద్రాలపై ఆదివారం రాత్రి ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. మానిక్‌రావ్, రాజన్నలు నిర్వహిస్తున్న స్నూకర్ కేంద్రాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి స్నూకర్ బాల్స్, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై మాట్లాడుతూ అక్రమంగా స్నూకర్ కేంద్రాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గర్భిణీ ఆత్మహత్యాయత్నం
బెల్లంపల్లిరూరల్: బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన ఓ గర్భిణీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆదివారం సాయంత్రం గాజులవేణి శ్రావణి అనే గర్భిణీ ఇంట్లో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా కుటుంబ సభ్యులు హుటాహుటిన బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. శ్రావణి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని తాళ్లగురిజాల ఎస్సై రామకృష్ణ తెలిపారు.