
అమ్మ కొలువుదీరే వేళాయె..!
నిర్మల్‌టౌన్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని నందిగుండం దుర్గామాత ఆలయం, హరిహర క్షేత్రం, బంగల్ పేట్ మహాలక్ష్మి, బాగులవాడ ఆంజనేయస్వామి తదితర ఆలయాల్లో ఏటా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం అధికారులు, నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేకంగా మండపాలను ముస్తాబు చేశారు. మామిడి తోరణాలు, విద్యుత్ దీపాలు, వివిధ రకాల పువ్వులతో అలంకరించారు.
నాలుగు దశాబ్దాలుగా బాగులవాడలో..
నిర్మల్‌లో నాలుగు దశాబ్దాలుగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బాగులవాడ కాలనీలోని ఆంజనేయస్వామి ఆలయంలో 1981లో మొదటగా దుర్గామాత చిత్రపటం ఉంచి రెండేళ్లు పూజలు చేశారు. తర్వాత 1983లో రెండు ఫీట్ల కర్ర విగ్రహం, 1985 నుంచి ఇప్పటివరకు మట్టి విగ్రహాలు ప్రతిష్టించి చీరలు, ఆభరణాలతో అలంకరించి పూజలు నిర్వహిస్తున్నారు. బాగులవాడ కాలనీలో సుమారు 500 కుటుంబాల వారు తొమ్మిది రోజులు ఉపవాస దీక్షలు చేస్తారు.
ప్రసిద్ధిగాంచిన నందిగుండం దుర్గామాత..
పట్టణంలో 19 ఏళ్ల కిందట నందిగుండం ప్రాంతంలోని మర్రిచెట్టు వద్ద దుర్గామాత వెలిసింది. భక్తులు అప్పటి నుంచి దుర్గామాతకు పూజలు చేస్తున్నారు. గత 14 ఏళ్లుగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆరేళ్ల క్రితం రూ.1.80 కోట్లతో ఆలయం కూడా నిర్మించారు.