
అష్టభుజ స్వామికి పదకొండు వాహనాలు..
లక్ష్మణచాంద: మండల కేంద్రంలోని అత్యంత పురాతనమైన అష్టభుజ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోనే అష్ట భుజాలు గల ఏకై క ఆలయం. శ్రీ వేణుగోపాలునికి ఎనిమిది చేతులు ఉంటాయి. ప్రతీ చేతిలో ఒక ఆయుధం ఉంటుంది. కత్తి, సుదర్శన చక్రం, విశ్వం, గదా, శంకు, పద్మం, రెండు పిల్లన గ్రోవీలు ఉన్నాయి. నవరాత్రుల్లో భాగంగా ప్రతీరోజు స్వామి వారు గ్రామంలోని రథంపై వివిధ వాహనాలపై ఊరేగుతారు. మొదటి రోజు సూర్య ప్రభ వాహనం, రెండో రోజు చంద్రప్రభ వాహనం, మూడో రోజు గజ వాహనం, నాలుగో రోజు అశ్వ వాహనం, ఐదో రోజు హంస వాహనం, ఆరో రోజు హనుమ వాహనం, ఏడో రోజు శేష వాహనం, ఎనిమిదో రోజు గరుడ వాహనం, తొమ్మిదో రోజు సింహ వాహనం, పదో రోజు పులి వాహనం, పదకొండో రోజు అశ్వం, గరుడ, హనుమ సహిత వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు.