
వరకట్న వేధింపులకు వివాహిత బలి
కుంటాల: వారు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు వీరి కాపురం సజావుగా సాగింది. తర్వాత భర్త అసలు రూపం బయటపడింది. అప్పటికే భార్య గర్భం దాల్చింది. అయినా వరకట్నం వేధింపులు భరిస్తూ వచ్చింది. మూడు నెలల క్రితం వీరికి పాప పుట్టింది. అయినా వేధింపులు ఆగలేదు. శనివారం రాత్రి భర్త కట్నం కోసం వేధించడంతో మనస్తాపం చెందింది. చంటిపాప ఉన్నా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కుంటాలలో జరిగింది. ఎస్సై అశోక్ కథనం ప్రకారం.. కుంటాల గ్రామానికి చెందిన షికారి పోశెట్టి, మామడ మండలం పోన్కల్ గ్రామానికి చెందిన స్రవంతి(18) ప్రేమించుకున్నారు. ఏడాది క్రితం పెద్దలను ఒప్పింది పెళ్లి చేసుకున్నారు. వీరికి మూడు నెలల క్రితం పాప జన్మించింది. పెళ్లయిన కొన్నాళ్ల నుంచే పోశెట్టి తనకు కట్నం కావాలని స్రవంతిని వేధిస్తున్నాడు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో పనిచేసే పోశెట్టి పాప పుట్టిన తర్వాత కట్నం కోసం భార్యను మరింతగా వేధించసాగాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి కట్నం కోసం తీవ్రంగా వేధించాడు. దీంతో మనస్తాపం చెందిన స్రవంతి.. గదిలో ఉరివేసుకుంది. ఆదివారం ఉదయం స్రవంతిని విగత జీవిగా చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భైంసా ఏఎస్పీ అవినాష్‌కుమార్, రూరల్ సీఐ నైలు ఘటన స్థలాన్ని పరిశీలించారు.
మూడు నెలలకే తల్లి ప్రేమకు దూరం..
పోశెట్టి–స్రవంతి దంపతుల కు మూడు నెలల కూతురు నితీక్ష ఉంది. తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో పుట్టిన మూడు నెలలకే తల్లి ప్రేమకు దూరమైంది. ఏం జరిగిందో తెలియని చిన్నారి ఆకలికి గుక్కపెట్టి ఏడవడం చూసి స్థానికులు చలించిపోయారు. తహసీల్దార్ కమల్ సింగ్ పంచనామా చేశారు. క్లూస్ టీం సభ్యులు నమూనాలు సేకరించారు. మృతురాలి తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

వరకట్న వేధింపులకు వివాహిత బలి