
పూలపండుగొచ్చింది
భైంసా: భైంసా పట్టణంలో సోమవారం బతుకమ్మ పండుగ ఘనంగా జరుగనుంది. మహారాష్ట్ర సరిహద్దు సమీపంలోని ఈ పట్టణంలో మహాలయ అమావాస్య తర్వాత వెంటనే బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. ఈ పండుగ, ప్రకృతి ఆరాధన, ఆత్మీయ బంధాలు, సామాజిక సమైక్యతను సూచిస్తూ, గ్రామీణ సంప్రదాయాలను సజీవంగా ఉంచుతుంది. మున్నూరుకాపు మిత్రమండలి ఆధ్వర్యంలో గడ్డెన్నవాగు వద్ద జరిగే బతుకమ్మ ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక్కడ మహిళల కోసం అల్పాహారం, తాగునీటి వసతి ఏర్పాట్లు చేస్తారు. సంప్రదాయ బతుకమ్మలను అందంగా పేర్చిన బృందాలకు జ్ఞాపికలు అందజేస్తూ, ఈ సంస్థ ఉత్సవ ఉత్సాహాన్ని మరింత పెంచుతుంది.
పూల సౌందర్యం..
బతుకమ్మలను రంగురంగుల పూలతో అలంకరించడం ఈ పండుగ ప్రధాన ఆకర్షణ. గ్రామీణ ప్రాంతాల్లో తంగేడు, గునుగు, చామంతి, బంతి పూలతో బతుకమ్మలను సౌందర్యవంతంగా తీర్చిదిద్దుతారు. పూల కొరత కారణంగా చాలామంది కాగితపు బతుకమ్మలు తయారు చేస్తున్నారు. ఇక బంతి పూల ధరలు ఈ సమయంలో రూ.60 నుంచి రూ.100 వరకు పెరుగుతున్నాయి.
మహిళల సమైక్యత
బతుకమ్మ పండుగ మహిళల సామాజిక బంధాలను బలపరుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు సామూహికంగా బతుకమ్మలను తయారు చేస్తూ, పాటలు పాడుతూ, నృత్యాలతో ఆనందిస్తారు. ఈ వేడుకలు కేవలం ఆధ్యాత్మిక ఆచరణలను మాత్రమే కాకుండా, సామాజిక సమైక్యతను కూడా పెంపొందిస్తాయి.