
నేటి నుంచి శరన్నవరాత్రులు
బాసర: బాసరలోని ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి ఆలయంలో శ్రీ శారదీయ నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ఆరంభం కానున్నాయి. వేడుకల్లో భాగంగా శ్రీసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్లకు ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఆరాధనలు నిర్వహిస్తారు. తెల్లవా రుజామున గణపతి పూజ, సుప్రభాత సేవ, మహాభిషేకం, అలంకరణ, మంగళహారతి, మంత్రపుష్పం వంటి వైదిక కార్యక్రమాలతో ఉత్సవాలు ఆరంభమవుతాయి. ఉదయం 9 గంటలకు విఘ్నేశ్వర పూజ, క్షేత్రపూజ, స్వస్తి పుణ్యాహవచనం, అంకురార్పణ, కలశ స్థాపన (ఘటస్థాపన) శాస్త్రోక్తంగా జరిపిస్తారు. కార్యక్రమాల్లో ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రామారావు పటేల్ పవార్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు. నవరాత్రి ఉత్సవాల మొదటి రోజు, అమ్మవారు శైలపుత్రి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. కట్టె పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ అలంకారం సరస్వతి అమ్మవారి శక్తి, జ్ఞాన స్వరూపాన్ని సూచిస్తుంది. భక్తులకు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని అందిస్తుంది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.