
సింగరేణిలో సమస్యలు పరిష్కరించాలి
శ్రీరాంపూర్: సింగరేణిలో సమస్యలు పరిష్కరించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఏఐటీయూసీ అధ్యక్షుడు వి.సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ కోరారు. శనివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరం 2024–25లో సాధించిన లాభాలు ప్రకటించి అందులో కార్మికులకు 35 శాతం వాటా ఇవ్వాలని కోరారు. ఎన్నోఏళ్లుగా కార్మికులు ఎదురుచూస్తున్న సొంతింటి పథకాన్ని నెరవేర్చాలన్నారు. పెర్క్స్‌పై పడుతున్న ఆదాయ పన్ను కంపెనే చెల్లించాలన్నారు. కోలిండియాలో మాదిరిగా సింగరేణిలో అమలు చేయాలని కోరారు. మెడికల్ బోర్డును ప్రక్షాళన చేయాలని, దీనికోసం 1981లో ఉన్న అన్‌ఫిట్ విధానం అమలు చేయాలన్నారు. మారుపేర్ల సమస్య పరిష్కరించాలని కంపెనీ దీనిపై అడ్వొకేట్ జనరల్ అభిప్రాయం కోరిందని, చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. కొత్త గనులు ఏర్పాటుతోపాటు కోయగూడెం, సత్తుపల్లి, తాడిచెర్ల బ్లాక్‌లు సింగరేణికే కేటాయించేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. లాభాల వాటా విషయమై త్వరగా సెటిల్ చేస్తామని సంస్థ సీఎండీని పిలిచి డీప్యూటీ సీఎంతో సమావేశం ఏర్పాటు చేస్తానని సీఎం తెలిపినట్లు ఏఐటీయూసీ నేతలు పేర్కొన్నారు.