ఇచ్చోడ: ‘గిరి’ గ్రామాల ప్రజలు ఏళ్లకేళ్లుగా దారి కష్టాలు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎటు వెళ్లాలన్నా వీరికి కాలినడకే దిక్కవుతోంది. వానాకాలంలో కాలినడక కూడా కష్టమవుతోంది. రాళ్ల దారి, బురద రోడ్లు, ఉధృతంగా ప్రవహించే వాగుల నుంచి వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. ఆదివాసీలు మండల కేంద్రాలు, పొరుగు గ్రామాలకు వెళ్లాలంటే కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సిందే. అత్యవసర సమయంలో గ్రామాలకు అంబులెన్స్ కూడా రాని దుస్థితి. సరైన రవాణా వ్యవస్థ లేక అత్యవసర వేళల్లో ఆస్పత్రికి చేరుకోలేక అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వాలు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా ఇప్పటికీ జిల్లాలోని చాలా గ్రామాలకు కనీసం మట్టి రోడ్లు కూడా లేకపోవడం గిరిజన గ్రామాల దుస్థితికి అద్దం పడుతోంది. వాగులపై వంతెనలు లేకపోవడంతో చాలా గ్రామాలకు వానాకాలంలో రెండు నెలలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి.
అంబులెన్స్ వెళ్లలేని గ్రామాలు
జిల్లాలోని మారుమూల గ్రామాలకు సరైన రోడ్లు లేక అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో ఆపదలో ఉన్నవారిని సమయానికి ఆస్పత్రులకు చేర్చడం వీలు కావడంలేదు. అకస్మాత్తుగా అస్వస్థతకు గురైతే కిలోమీటర్ల దూరం కాలినడకన లేదా ఎడ్ల బండ్లపై తీసుకెళ్లాల్సిన దుస్థితి ఉంది. జిల్లాలో ఇప్పటివరకు రోడ్లు లేని గ్రామాలు చాలానే ఉన్నాయి. ఇచ్చోడ మండలం బావోజీపేట్, గుండి, గుండివాగు, సిరికొండ మండలం బుర్సిగుట్ట, ధర్మన్నపేట్, నేరడిగొండ మండలం అద్దల తిమ్మపూర్, లక్ష్మాపూర్, పీచర, గాజిలి, బజార్‌హత్నూర్ మండలం ఉమార్ద, ఇంద్రానగర్, రెంగన్‌వాడీ, గిరిజాయి, డెడ్రా, మాన్కపూర్, కొత్తపల్లి, భీంపూర్ మండలం గుబడి, గుబిడిపల్లి, నార్నూర్ మండలం ఉమ్రి, సీతగూడ, బారిక్‌రావుగూడ, లొద్దిగూడ, కొలాంగూడ గ్రామాలకు రోడ్డు సౌకర్యంలేదు. దీంతో వానాకాలంలో నానా ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
రోడ్డు సౌకర్యం కల్పించాలి
గిరి గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. అత్యవసర సమయంలో గిరిజనులు వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వాలు గిరిజన ప్రజల ఆవేదనను అర్థం చేసుకుని రోడ్డు సౌకర్యం కల్పించాలి.
– టేకం దేవురావు, బావోజీపేట్ మాజీ సర్పంచ్
వానాకాలంలో అవస్థలు
గిరిజన గ్రామాలకు రోడ్డు లేదు. రోడ్లున్న చోట వంతెనలు లేవు. వానాకాలంలో అంబులెన్స్ కూడా వెళ్లవు. అత్యవసర సమయంలో గర్భిణులు, బాలింతలను కిలోమీటర్ల దూరం కాలినడకన తీసుకెళ్లాల్సి వస్తోంది. వంతెనలు, రోడ్లు నిర్మించాలి.
– కొడప నగేశ్, ‘తుడుం’ రాష్ట్ర కార్యదర్శి
ఇటీవలి ఘటనలు కొన్ని..
ఈ నెల 16న సిరికొండ మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన కన్నపూర్ తండాకు చెందిన మీనా ఇంద్రవెల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. 18న ఆమెను డిశ్చార్జి చేశారు. 102 వాహనంలో ఆమెను గ్రామానికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో వాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో వాహనం వెళ్లలేని పరిస్థితి ఉండడంతో పైలెట్ పసిబిడ్డతో సహ బాలింతను వాగు దాటించాడు. అక్కడి నుంచి కిలోమీటరు దూరం వరకు బాలింత కాలినడకన గ్రామానికి చేరుకోవాల్సి వచ్చింది. ఈ నెల 17న ఉట్నూర్ మండలంలోని మత్తడి సుంగుగూడ గ్రామానికి చెందిన కుమ్ర పారుబాయి అనారోగ్యంతో మృతి చెందింది. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బంధువులు గ్రామానికి వచ్చే క్రమంలో సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహించింది. ప్రమాదం అని తెలిసినా బంధువులు ఒకరి చేయి ఒకరు పట్టుకుని నడుంలోతు నీటిలో వాగు దాటాల్సి వచ్చింది.
‘గిరి’ గ్రామాలకు దారి కష్టాలు
‘గిరి’ గ్రామాలకు దారి కష్టాలు