
పత్తిలో చీడపీడలు
చెన్నూర్‌రూరల్: ఈసారి పత్తి పంట ఆశాజనకంగా ఉంది. కానీ.. అధిక వర్షాలు కురిసిన చోట పంటను చీడ, పీడలు ఆశిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలంలో 1.61లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తున్నారు. దుక్కి దున్నడం, విత్తనాలు, క్రిమిసంహారకాలు, ఎరువుల కోసం ఒక్కో ఎకరాకు సుమారు రూ.30వేల నుంచి రూ.45వేల వరకు ఖర్చు చేశారు. మొదట పత్తి విత్తనాలు వేసిన సమయంలో సరిగా వర్షాలు కురవలేదు. మొలకెత్తక పోవడంతో కొందరు రైతులు మళ్లీ విత్తనాలు వేశారు. ఆగస్టు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండగా ప్రస్తుతం పంటకు చీడపీడలు సోకుతున్నాయి. క్రిమిసంహారకాలు పిచికారీ చేద్దామంటే రోజూ వర్షం కురుస్తోంది. ఇప్పుడే పత్తి పూత దశలో ఉంది. కొన్ని చోట్ల కాయ దశలో ఉంది. పచ్చ దోమ, తెల్ల దోమ ఆశించి మొక్కల అడుగు భాగం నుంచి పత్రహరితాన్ని పీలుస్తున్నాయి. దీంతో ఆకులు మొదట పచ్చబారి, ఆ తరువాత ఎరుపు రంగులోకి మారుతున్నాయి. ఆకులు కింది వైపునకు ముడుచుకుపోతున్నాయి. చెట్టు కొనలు ముడుచుకుపోయి పెరుగుదల తగ్గి, పూత, కాత తగ్గనుంది. ఈ పురుగులు రసం పీల్చడంతో గూడలు బలహీన పడతాయి. పిందె పరిమాణం తగ్గుతుంది. ఈ కారణంగా దిగుబడి కూడా తగ్గి పోయే అవకాశముందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

పత్తిలో చీడపీడలు