
పోలీసులపై దాడులు చేస్తే కఠిన చర్యలు
భైంసాటౌన్: పోలీసులపై దాడులు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని అదనపు ఎస్పీ అవినాష్‌కుమార్ హెచ్చరించారు. కుభీర్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కాని స్టేబుల్‌పై దుండగుడు కత్తితో దాడి చేసిన కేసు వివరాలను శుక్రవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆయన వెల్లడించారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన అబ్దుల్ కలీం (51)కు కుభీర్ మండలకేంద్రానికి చెందిన మహిళతో వివాహం కాగా, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు తలెత్తేవి. ఈ క్రమంలో భార్య కు భీర్‌లోని తన పుట్టింటికి రాగా, మరోసారి ఇద్దరి మ ధ్య తగాదా తలెత్తింది. దీంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని భార్య భర్తను బెదిరించగా, అదే రోజు రాత్రి మద్యం మత్తులో నిందితుడు అబ్దుల్ కలీం మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎస్సై గదిలోకి వెళ్లబోయాడు. దీంతో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ నారాయణ అడ్డుకునే యత్నంలో కత్తితో గాయపర్చి పారిపోయాడు. ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలతో గాలించగా శుక్రవారం కు భీర్ శివారులో నిందితుడిని అరెస్ట్ చేశారు. అబ్దుల్ కలీం గతంలో ధర్మాబాద్‌లోనూ హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు విచారణలో వెల్లడైందని అదనపు ఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐలు గోపీనాథ్, నైలు, కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డి పాల్గొన్నారు.