
మేకలకు అంతుచిక్కని రోగం
● గుట్ట ప్రాంత గ్రామాల్లో ఎక్కువ ● ఇలేగాంలో 17 మేకలు మృతి ● చికిత్స అందేవరకు బతకడం లేదు..
ఈ ఫొటోలో చనిపోయిన మేకలను చూపుతున్న రైతు పేరు కదం దత్తురాం. ఇలేగాం గ్రామానికి చెందిన దత్తురాంకు మేకల పెంపకమే జీవనాధారం. 80 మేకలు మేపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గ్రామాన్ని ఆనుకుని ఉన్న గుట్ట ప్రాంతంలో మేకలను మేపుతున్నాడు. ఇటీవల మేకలను మేపి సాయంత్రం ఇంటికి తీసుకొచ్చాడు. ఉద యం లేచి చూసేసరికి పది మేకలు మరణించాయి. కొన్ని మేకలు జలుబు చేసినట్లు బాధ పడుతుండడంతో పశువైద్యులకు సమాచారం అందించాడు. చికిత్స చేయించినా రోగం నయం కాక మరో ఏడు మేకలు మరణించాయి. మరణించిన మేకల విలువ రూ.2.50 లక్షలు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశాడు.
లోకేశ్వరం : జిల్లాలో మేకలు వింత రోగంతో మరణిస్తుండటం యజమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా, సీసీపీపీ(కంటైజెస్ క్యాప్రిన్ ప్లూరో నిమోనియా) వ్యాధి కారణంగా భైంసా మండలం ఇలేగాం గ్రామంలో 17 మేకలు మరణించా యి. ఈ సమస్యపై అధికారుల నిర్లక్ష్యం యజమానులలో అసంతృప్తిని పెంచుతోంది. సీసీపీపీ (కంటైజెస్ క్యాప్రిన్ ప్లూరో నిమోనియా) అనేది మైకో ప్లాస్మా క్యాప్రీ వైరస్ వల్ల సంక్రమించే ఒక అంటు వ్యాధి. ఈ వ్యాధి సోకిన మేకలలో 50% మాత్రమే బతికే అవకాశం ఉందని భైంసా పశువైద్యాధికారి విఠల్ తెలిపారు. జిల్లాలో ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుంది. సరైన నివారణ చర్యలు లేకపోతే పశుసంపదకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఇటీవల ఇలేగాం గ్రామంలో 17 మేకలు ఈ వ్యాధి బారిన పడి మరణించాయి.
యజమానుల ఆందోళనలు
జిల్లాలోని వివిధ గ్రామాల్లో రెండు రోజులుగా మేకలు సీసీపీపీ వ్యాధితో మరణిస్తున్నాయి. సాయంత్రం మేతకు వెళ్లి వచ్చిన మేకలు ఉదయానికి మరణిస్తుండటం యజమానులను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లా అధికారులు ఈ సమస్యపై తగిన శ్రద్ధ చూపకపోవడంతో యజమానులు నిరాశతో ఉన్నారు.
సీసీపీపీ వ్యాధి లక్షణాలు
106 డిగ్రీల వరకు జ్వరం, మూలుగుతూ ఉంటాయి.
ఉబ్బసం వల్ల ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.
ముక్కు నుంచి చీమిడి, కళ్ల నుంచి నీరు కారుతుంది.
నిరంతరం పొడి దగ్గు ఉంటుంది.
మేకను వెనక కాళ్లు పట్టి పైకి లేపి, తలను క్రిందికి వంచితే ముక్కు నుంచి నీటిలాంటి స్రావం కనిపిస్తుంది.
చికిత్స, నివారణ చర్యలు
తగిన మోతాదులో యాంటీబయాటిక్ మందులు వాడాలి.
టైలోసిన్ ఇంజెక్షన్‌ను ఏడు రోజులు ఇవ్వాలి.
పశువైద్యుల సలహా మేరకు మందులు వాడాలి.
మేకల పాకలను పరిశుభ్రంగా ఉంచడం, గాలి, వెలుతురు ఉండేలా చూడాలి.
గుంపుగా మేకలు ఉండకుండా చూడాలి.
ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసిన మేకలను వేరుగా ఉంచాలి.
వ్యాధి సోకిన మేకలను మంద నుంచి వేరుచేయాలి.