
ఆర్జీయూకేటీలో ముగిసిన ఓఎల్‌ఐ, ఎంఎల్బీఏ శిక్షణ
బాసర: బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ)లో ప్రఖ్యాత వార్టన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాతో కలిసి నిర్వహించిన ‘‘ఆర్గనైజేషనల్ లీడర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ (ఓఎల్‌ఐ), మెషిన్ లెర్నింగ్ అండ్ బిజినెస్ అనలిటిక్స్ (ఎంఎల్బీఏ)’’ కోర్సు విజయవంతంగా ముగిసింది. కార్యక్రమం విద్యార్థులకు నాయకత్వ నైపుణ్యాలు, సాంకేతిక జ్ఞానం, డేటా ఆధారిత నిర్ణయాధికారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించింది. 14 రోజుల ఈఇంటెన్సివ్ కోర్సు విద్యార్థులకు ఆర్గనైజేషనల్ లీడర్‌షిప్, ఎథిక్స్, స్ట్రాటజిక్ మార్కెటింగ్, మెషీన్ లర్నింగ్ మోడల్స్, బిజినెస్ అనలిటిక్స్ ఫ్రేమ్‌వర్క్‌లో శిక్షణను అందించింది. థియరీతోపాటు, రియల్–టైమ్ కేస్ స్టడీస్, సిమ్యులేషన్‌ల ద్వారా విద్యార్థులలో ఆచరణాత్మక అంతర్‌దృష్టిని పెంపొందించేలా ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఇన్‌చార్జి వీసీ గోవర్ధన్, ఓఎస్డీ మురళీధరన్, కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్‌లు అందించారు.