
● ఇటీవల నోటిఫికేషన్ జారీచేసిన కేంద్రం ● రెండు దశల్లో ల
నిర్మల్‌చైన్‌గేట్: జనగణనకు కేంద్ర హోంశాఖ ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2027, మార్చి 1 నాటికి రెండు దశల్లో జనాభా లెక్కలు సేకరించనున్నారు. తొలిదశలో ఇళ్ల జాబితా తయారు చేసి, రెండో దశలో జనగణన నిర్వహిస్తారు. సాధారణంగా పదేళ్లకోసారి జనాభా లెక్కలు సేకరిస్తారు. 2011లో చివరిసారిగా జనగణన జరగ్గా, 2021లో కోవిడ్ కారణంగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. 16వ జనగణనలో కులగణన, జాతీయ పౌర పట్టికను కూడా చేర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది.
జిల్లాస్థాయిలో సమన్వయ కమిటీ
జనగణన కోసం కలెక్టర్ నేతృత్వంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ), డీఆర్వో, సీపీవో, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారితో కమిటీ ఏర్పాటవుతుంది. మండలస్థాయిలో తహసీల్దార్ జనగణన అధికారిగా, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సహాయకుడిగా వ్యవహరిస్తారు. ఎన్యుమరేటర్లుగా ఉపాధ్యాయులను నియమిస్తారు, వీరు కేంద్రం అందించిన ప్రశ్నావళి ఆధారంగా డేటా సేకరిస్తారు.
ఎన్యుమరేటర్లకు శిక్షణ
2026లో ఎన్యుమరేటర్లను నియమించి శిక్షణ ఇస్తారు. 150 గృహాలకు ఒక ఎన్యుమరేటర్ చొప్పున, ఆరుగురు ఎన్యుమరేటర్లకు ఒక సూపర్‌వైజర్‌ను నియమిస్తారు. వీరు మొదట గ్రామాల్లో ఇళ్లు, కుటుంబాల సంఖ్యను గుర్తిస్తారు. ఆ తర్వాత ఇంటింటికీ తిరిగి జనాభా వివరాలు సేకరిస్తారు.
పట్టణీకరణకు అనుకూలంగా..
భవిష్యత్ విస్తరణను దృష్టిలో ఉంచుకుని, మున్సిపాలిటీలకు సమీపంలోని ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మేజర్ గ్రామ పంచాయతీలు, రైల్వే కాలనీలు, విశ్వవిద్యాలయాలు, సైనిక శిబిరాలను ప్రత్యేకంగా గుర్తించి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా వివరాలు సేకరిస్తారు.
2027లో జనగణన పూర్తి
2026లో శిక్షణతోపాటు జనగణన ప్రక్రియ పై అవగాహన కల్పిస్తారు. 2027 జనవరి, ఫిబ్రవరిలో ఇంటింటికీ వెళ్లి డేటా సేకరిస్తా రు. 2027 ఫిబ్రవరి 28 అర్ధరాత్రి 12 గంటలలోపు జన్మించిన వారిని లెక్కలోకి తీసుకుంటారు. మార్చి 1 నాటికి ప్రక్రియ పూర్తవుతుంది. గతంలో మాన్యువల్‌గా జరిగిన జనగణనకు భిన్నంగా, ఈసారి మొబైల్ యాప్‌లో వివరాలు నమోదు చేస్తారు.