
ఉపాధ్యాయుల డుమ్మాకు చెక్!
● త్వరలో పాఠశాలల్లో ఫేస్ రికగ్నేషన్ సిస్టం ● ఆన్‌లైన్‌లోనే హాజరు నమోదు ● ప్రతిపాదనలు పంపిన విద్యాశాఖ
లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సరికొత్త చర్యలు చేపడుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ముఖ గుర్తింపు విధానం (ఫేస్ రికగ్నీషన్ సిస్టం) రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే విద్యార్థులకు ఈ విధానం అమలులో ఉంది. ఉపాధ్యాయులకూ అమలు చేసేందుకు విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
విద్యార్థుల నుంచి ఉపాధ్యాయుల వరకు..
గత విద్యాసంవత్సరం నుంచి విద్యార్థుల హాజరును 90 శాతానికి పెంచేందుకు ప్రవేశపెట్టిన ఎఫ్‌ఆర్‌ఎస్(ఫేస్ రికగ్నేషన్ సిస్టం) సత్ఫలితాలు ఇచ్చింది. ఈ విధానం కింద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత సాంకేతికతతో రూపొందించిన యాప్‌ను 2023లో అభివృద్ధి చేశారు. ఉపాధ్యాయులు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్‌ను ఉపయోగించి, విద్యార్థుల ముఖాలను స్కాన్ చేయడం ద్వారా ఒకేసారి 15 నుంచి 20 మంది విద్యార్థుల హాజరును నమోదు చేస్తుంది. ఈ విధానం విద్యార్థుల హాజరు శాతాన్ని కచ్చితంగా లెక్కించడంతోపాటు, మధ్యాహ్న భోజన పథకం సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు తోడ్పడుతోంది. ఈ ఫలితాల ఆధారంగా, ఉపాధ్యాయుల హాజరు కోసం కూడా ఈ విధానం అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.
జిల్లాలో 2,571 మంది ఉపాధ్యాయులు..
జిల్లాలో 88 మంది గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, 47 మంది ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలు, 1,176 మంది స్కూల్ అసిస్టెంట్‌లు, 1,237 మంది ఎస్జీటీలు, 11 మంది లాంగ్వేజ్ పండిట్‌లు, 12 మంది పీఈటీలుసహా మొత్తం 2,571 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఈ విధానం అమలైతే పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు మెరుగుపడనుంది.
డుమ్మాలకు చెక్..
గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులు చాలా మంది సమయపాలన పాటించడం లేదు. ఇదే సమయంలో పాఠశాలకు వెళ్లకున్నా.. వెళ్లినట్లు రిజిస్టర్‌లో సంతకాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక కొందరు ఆలస్యంగా బడికి వెళ్లి.. తొందరగా ఇంటికి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఎఫ్‌ఆర్‌ఎస్ అమలయితే డుమ్మాలకు చెక్ పడుతుంది. సమయపాలన మెరుగుపడుతుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది.
ఆదేశాలు రాలేదు..
ఉపాధ్యాయులకు ముఖ గుర్తింపు హాజరు నమోదుపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు రాలేవు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు, ఉన్నతాధికారుల సూచనల మేరకు చర్యలు చేపడతాం. ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు చేయాలని ఆదేశిస్తే, అమలుకు సిద్ధంగా ఉన్నాం.
– రామారావు, జిల్లా విద్యాధికారి