
కార్మికుల భద్రతకు ‘నమస్తే’
● కొత్త పథకానికి కేంద్రం శ్రీకారం ● జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో అమలు ● గుర్తించిన కార్మికుల వివరాలు యాప్‌లో నమోదు
పథకంలోని ప్రధాన అంశాలు..
● ఆరోగ్య సదుపాయం: ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం.
● సబ్సిడీ సాయం: పారిశుద్ధ్య సంబంధిత వాహనాల కొనుగోలుకు సబ్సిడీ.
● విద్యాసాయం: కార్మికుల పిల్లల విద్యకు ఆర్థిక సహాయం.
● పునరావాసం: ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడం ద్వారా కార్మిక కుటుంబాలకు పునరావాసం.
నిర్మల్‌చైన్‌గేట్: మున్సిపాలిటీలలో ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల కోసం ‘జాతీయ యాంత్రీక పారిశుద్ధ్య పర్యావరణ వ్యవస్థ(నమస్తే)’ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలలో అర్హులైన కార్మికులను గుర్తించి, వారి వివరాలను ‘నమస్తే’ యాప్‌లో నమోదు చేస్తున్నారు. మరుగుదొడ్ల వ్యర్థాలు తొలగించే కార్మికులు, సెప్టిక్ ట్యాంకులు, మురుగు కాలువలు, మ్యాన్‌హోల్స్ శుభ్రపరిచే కార్మికులు, చెత్త సేకరించేవారు ఈ పథకం కింద లబ్ధి పొందనున్నారు.
కార్మికులకు భద్రత, పునరావాసం..
‘నమస్తే’ పథకం పారిశుద్ధ్య కార్మికులకు ఒక వరంగా మారనుంది. కార్మికుల భద్రత, గౌరవం, సురక్షితమైన పని వాతావరణం కల్పించడంతోపాటు, ప్రత్యేక పరికరాలు అందించడం, ఆధునిక సురక్షిత పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం, ప్రత్యామ్నాయ జీవనో పాధి కల్పించడం ఈ పథకం లక్ష్యాలు. గుర్తించిన కార్మికులకు ఆరోగ్య కిట్లు అందజేయడంతోపాటు, యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించే చర్యలు చేపడతారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలు నిర్వహిస్తారు.
చెత్త సేకరణ కార్మికులకు కూడా..
పట్టణాల్లో చెత్త సేకరణ ద్వారా జీవనం సాగించే కు టుంబాలు డంప్ యార్డులు, చెత్త నిల్వ ప్రదేశాల నుంచి చెత్త సేకరించి అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ కార్మికులు తమ వివరాలను అధికారులకు అందించి ‘నమస్తే’ యాప్‌లో నమో దు చేసుకోవచ్చు. నమోదైన కార్మికులకు భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం పించన్, ఆర్థికసాయం అందించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నిర్మల్ మున్సిపాలిటీలో ఏడుగురు, ఖానాపూర్‌లో ఇద్దరు, భైంసాలో ఒక కార్మికుడిని ఇప్పటివరకు గుర్తించి నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
నమోదు చేస్తున్నాం
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నమస్తే పథకంలో భాగంగా కార్మికులను గుర్తించి యాప్ నమోదు చేస్తున్నాం. కార్మికులకు ముందుగా ఈ కేవైసీ చేయించి యాప్‌లో రిజిస్టర్ చేయిస్తున్నాం. అర్హులందరూ వివరాలు నమోదు చేసుకొని ప్రయోజనం పొందాలి. – ఎండీ అజారొద్దీన్,
మున్సిపల్ పర్యావరణ ఇంజినీర్, నిర్మల్