
‘ప్రజా’ ఫిర్యాదులు పరిష్కరించాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● ప్రజావాణిలో అర్జీల స్వీకరణ
నిర్మల్‌టౌన్: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితుల గోడును ఓపికగా విన్నారు. సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు. ప్రజావాణికి భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు తదితర అంశాలపై ఎక్కువగా అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. సంబంధిత శాఖల మధ్య సమన్వయం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూభారతి చట్టం అమలును తహసీల్దార్లు నిరంతరం పర్యవేక్షించాలని, దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్ ప్రక్రియ ఇప్పటికే 55 శాతం పూర్తయిందని తెలిపారు. మిగిలిన భాగాన్ని తక్షణమే పూర్తి చేసి, నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం రూ పొందించిన ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో రెండోదశ జ్వర సర్వే 34 శాతం పూర్తయినట్టు పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, పరీక్ష కిట్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు మరుగుదొడ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎంపీడీవోలు వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు. మండలాల ప్రత్యేకాధికారులు తమ పరిధిలోని అన్ని శాఖల పనులను పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటగా నిర్మల్ జిల్లా సంరక్షణ గృహాల్లో ఉండే అనాథ పిల్లలకు ప్రత్యేక ఆరోగ్యశ్రీ కార్డులు అందించామని తెలిపారు. వీటి ద్వారా వారికి రూ.10 లక్షల వరకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందుతుందని పేర్కొన్నారు.
సబ్సిడీ చెక్కు అందజేత
సారంగాపూర్ మండలం తాండ్ర(జి) గ్రామానికి చెందిన రైతు సందుపట్ల రాజేశ్వర్‌కు మల్బరీ సాగుకు షెడ్ నిర్మాణానికి సిల్క్ సమగ్ర–2 పథకం కింద రూ.4.50 లక్షలు మంజూరయ్యాయి. తొలి విడతగా రూ.93,775 సబ్సిడీ చెక్కు మంజూరు కాగా, కలెక్టర్ లబ్ధిదారుకు అందజేశారు. రైతులు వినూత్నంగా ఆలోచించి కొత్త పంటల సాగు చేసి, అధిక లాభాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామ సమస్యలు తీర్చాలి
కుభీర్ మండలం సాంగ్వి గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి. గ్రామానికి రోడ్డు వెయ్యాలి. బస్సు సౌకర్యం కల్పించాలి. మా గ్రామంలో ఎన్నో సమస్యలు ఉ న్నాయి. ఈ సమస్యలను పరిష్కరించి మా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి.
– సాంగ్వి గ్రామ ప్రజలు
కెనాల్ సరి చేయాలి
సారంగాపూర్‌లోని అంబావాయి చెరువు కెనాల్ సరిచేయాలి. కెనాల్ సరిగా లేక 200 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. సమస్యను ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేదు. మీరైనా కెనాల్‌ను సరిచేయించి సాగునీరందించాలి.
– సారంగాపూర్ రైతులు

‘ప్రజా’ ఫిర్యాదులు పరిష్కరించాలి

‘ప్రజా’ ఫిర్యాదులు పరిష్కరించాలి