
ఆడంబరాలు వద్దు..
● సాదాసీదానే ముద్దు.. ● వేడుకల పేరుతో వృథా ఖర్చుపై మహిళల అభ్యంతరం ● పెరిగిన ప్లాస్టిక్ వినియోగంపై ఆందోళన ● పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని తీర్మానం
నిర్మల్‌ఖిల్లా: ఆడంబరాల పేరుతో డబ్బులు వృథా చేయవద్దని, సాదాసీదాగా పెళ్లిళ్లు, శుభకార్యాలు ని ర్వహించాలని జిల్లా మహిళలు అన్నారు. పట్టణంలోని ఏఎన్.రెడ్డి కాలనీ క్లబ్‌హౌస్ సమావేశ మంది రంలో సోమవారం నిర్వహించిన సమావేశానికి జి ల్లాకు చెందిన 150 మందికిపైగా మహిళలు హాజరయ్యారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో ఆడంబర ఖర్చులను తగ్గించాలని, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని తీర్మానించారు. ప్రస్తుతం ఉన్నత, మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలుసహా అన్నివర్గాల ప్రజలు శుభకార్యాలలో హంగు, ఆర్భాటాల పేరుతో విపరీతంగా ఖర్చు చేస్తున్నారని పలువురు తెలిపారు. దీనిని సాధ్యమైనంత మేరకు తగ్గించాలని అభిప్రాయపడ్డారు.
ఆలోచనా విధానం మారాలి..
మారుతున్న కాలానికి అనుగుణంగా జీవన విధానంలో వచ్చిన మార్పులకు తగ్గట్టు కుటుంబాల ఆలోచనా విధానంలోనూ మార్పు రావాలని మహిళలు పేర్కొన్నారు. సమాజానికి ప్రమాదకరంగా మారుతున్న ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, పర్యావరణానికి హాని కలగని విధంగా శుభకార్యాలు నిర్వహించాలని సూచించారు. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్ల వినియోగాన్ని నివారించాలని, మొక్కల ప్రాధాన్యతను సమాజానికి తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని నిర్ణయించారు. కార్యక్రమంలో మహిళా సంఘం సభ్యులు కేశపల్లి ఇందిర, అల్లోల వినోద, శిరీష, విజయలక్ష్మి, సుజన, సౌజన్య, సరళ, స్వరూప, సుమ, శోభ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.