● ప్రత్యేక ప్రార్థనలకు మసీదులు, ఈద్గాల్లో ఏర్పాట్లు ● ఈద్ ఉల్ ఫితర్ నమాజ్‌కు సిద్ధమైన ముస్లింలు
నెన్నెల: రంజాన్ ఉపవాస దీక్షలు ముగిసాయి. ముస్లింలు అత్యంత పవిత్రంగా నెల రోజులపాటు ఉపవాస దీక్షలు ఆచరించి బుధవారం నాటికి 30 రోజులు కావడంతోపాటు సాయంత్రం ఆకాశంలో నెలవంక దర్శనమిచ్చింది. దీంతో గురువారం రంజాన్ పండుగను జరుపుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. రంజాన్ దీక్షల అనంతరం షవ్వాల్ మాసం మొదటి రోజు నిర్వహించుకునే పండుగే ఈద్–ఉల్–ఫితర్. ఈ రోజు మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు చేశారు.
ఫిత్రాదానం
పండుగ రోజు నమాజ్‌కు ముందు పేదలకు ఇచ్చే దానమే ఫిత్రా. ఉపవాసాల పాటింపులో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొరపాట్లు, లోపాలు జరుగుతూనే ఉంటాయి. ఈ లోపాలను పరిహారం చేసేదే ఫిత్రాదానం. సమాజంలోని నిరుపేదలు మంచి వస్త్రాలు ధరించి, మంచి వంటకాలు ఆరగించే వీలు కల్పిస్తూ ముస్లింలు దానం చేస్తుంటారు.