ఎవరీ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ సింగం.. ! | Who is UPs Singam IPS Ajay Sharma | Sakshi
Sakshi News home page

ఎవరీ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ సింగం.. !

Apr 28 2026 6:09 PM | Updated on Apr 28 2026 7:41 PM

Who is UPs  Singam IPS Ajay Sharma

అజయ్‌ పాల్‌ శర్మ.. ఆయనొక ఐపీఎస్‌ అధికారి. 2011 ఐపీఎస్‌ బ్యాచ్‌ యూపీ క్యాడర్‌కి చెందిన అధికారి.  ఇప్పుడు మరొకసారి వార్తల్లోకి వచ్చారు. 2026 పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌ పోలీస్‌ అబ్జర్వర్‌గా నియమితులైన అజయ్‌ పాల్‌ శర్మను యాక్షన్‌ ఓరియెంటెడ్‌ ఐపీఎస్‌ అధికారిగా చెప్పుకోవచ్చు.  

తాజాగా పశ్చిమ బెంగాల్‌లో అధికార టీఎంసీ అభ్యర్థికి ఐపీఎస్‌ అజయ్‌ పాల్‌ ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇప్పుడు బెంగాల్ రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. తాను ఎక్కడైనా ఒక్కటేనని, అది యూపీ అయినా, పశ్చిమ బెంగాల్‌ అయినా యాక్షన్‌ ఓరియెంటేషన్‌ ఉంటుందనే విషయాన్ని మరోసారి నిరూపించుకున్నారు. ఫలితంగా మరోసారి హాట్‌ టాపిక్‌గా మారారు అజయ్‌ పాల్‌ శర్మ. యూపీ సింగంగా, ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా ఆయన ప్రజలకు సుపరిచితం.  ఇంతకీ ఈ అజయ్‌ పాల్‌ శర్మ ఎవరు? ఏమిటా కథ అనే దానిపై ఓ లుక్కేద్దాం. 

అజయ్‌ పాల్‌ శర్మకు ముందు డాక్టర్‌ అనే బిరుదు కూడా ఉంది. 1985లో పంజాబ్‌ రాష్ట్రంలోని లూధియానాలో జన్మించిన ఈ ‘సింగం’.. ముందు డెంటల్‌ సర్జన్‌. తొలుత ప్రజలకు పళ్లు ట్రీట్‌మెంట్‌ చేసిన అజయ్‌ పాల్‌.. ఆ తర్వాత 2008లొ సివిల్‌ సర్వీస్‌ కోసం సిద్ధం కాగా, 2011లో ఐపీఎస్‌ అయ్యారు. ఆపై 2013 నుంచి తనలో ఉన్న అసలు సిసలైన సింగంను చూపించసాగాడు. 

జౌన్పూర్‌, షామ్లీ, రాంపూర్‌, హత్రాస్‌, నోయిడా వంటి జిల్లాల్లో ఎస్పీ, ఎస్‌ఎస్‌పీగా పనిచేసిన అజయ్‌ పాల్‌.. ప్రస్తుతం ప్రయాగరాజ్‌లో అదనపు పోలీస్‌ కమిషనర్‌ (లా అండ్‌ ఆర్డర్‌) గా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. 

ఓవరాల్‌గా 500కిపైగా ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న సింగం  అజయ్‌ పాల్‌.. 22 నెలల కాలంలో  జౌన్పూర్‌లో 136 ఎన్‌కౌంటర్లు చేసి రికార్డు సృష్టించారు. ప్రధానంగా అక్రమార్కులు, గ్యాంగ్‌స్టర్లు, దొంగలు, దాడులు చేసే గ్యాంగ్‌లు, కిడ్నాప్‌ కేసుల్లో ఉన్నవారు, మాఫియా గ్యాంగ్‌ తదితర ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నారు. 

ఆయన పని చేసిన జిల్లాల్లో (జౌన్పూర్‌, షామ్లీ, రాంపూర్‌, నోయిడా మొదలైనవి) స్థానిక క్రిమినల్‌ గ్యాంగ్‌లను అణచివేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇంటెలిజెన్స్‌ ఆధారంగా, ఎదురుకాల్పులలో నేరస్థులను అణచివేయడంలో దిట్ట. కఠినమైన పోలీసింగ్‌ శైలితో ఆయనకు ‘యూపీ సింగం’ అనే పేరు వచ్చింది. 

డీజీ కమండేషన్‌ డిస్క్‌ (సిల్వర్‌ – 2017), డీజీ కమండేషన్‌ డిస్క్‌ (గోల్డ్‌ – 2025) ఈ రెండు పురస్కారాలు అజయ్‌ పాల్‌ గెలుచుకున్నారు. ఇవి ఉత్తరప్రదేశ్‌ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఇచ్చే ప్రత్యేక గుర్తింపు.  అత్యుత్తమ సేవలు, ధైర్యం, నేర నియంత్రణలో విశేష కృషి చేసిన అధికారులకు ఈ అవార్డు లు ఇస్తారు.  పోలీస్‌ విభాగంలో తన ప్రత్యేకమైన సేవతో తొలుత  సిల్వర్‌ డిస్క్‌ సాధించిన అజయ్‌ పాల్‌.. ఆపై తన అత్యున్నత స్థాయి కృషితో గోల్డ్‌ డిస్క్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.

బెంగాల్‌కు యూపీ ‘సింగం’.. ఊర మాస్‌ వార్నింగ్‌!
 

Advertisement
 
Advertisement
Advertisement