కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న యూపీకి చెందిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్, పోలీస్ అబ్జర్వర్ అజయ్ పాల్ శర్మ.. అధికార టీఎంసీ అభ్యర్థికి ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇప్పుడు బెంగాల్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.
ఆకతాయి పనులొద్దు
ఫల్టా నియోజకవర్గంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థి జహంగీర్ ఖాన్ అనుచరులు.. ఓటర్లను బెదిరిస్తున్నారంటూ స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో అజయ్ పాల్ శర్మ స్వయంగా రంగంలోకి దిగారు. జహంగీర్ నివాసానికి చేరుకున్న ఆయన, అక్కడ అభ్యర్థి లేకపోవడంతో కుటుంబ సభ్యులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ‘జహంగీర్‌కు స్పష్టంగా చెప్పండి.. ప్రజలను బెదిరించినట్లు మళ్లీ ఫిర్యాదులు వస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి.. ఎవరైనా తప్పుడు పనులకు పాల్పడినా, ఓటర్లను వేధించినా వదిలే ప్రసక్తే లేదు’ అని ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారని సమాచారం.
భద్రతపై అనుమానాలు.. ఎస్పీకి నోటీసులు
జహంగీర్ ఖాన్ నివాసం వద్ద మోహరించిన భద్రతా సిబ్బంది వివరాలను కూడా శర్మ ఆరా తీశారు. అక్కడ 14 మంది పశ్చిమ బెంగాల్ పోలీసులు ఉండటాన్ని గమనించిన ఆయన స్థానిక ఎస్పీ నుంచి వివరాలు కోరారు. అయితే, జహంగీర్‌కు ఉన్న వై-కేటగిరీ భద్రత కింద కేవలం 10 మంది సిబ్బందిని మాత్రమే కేటాయించినట్లు ఎస్పీ తెలిపారు. దీంతో మంజూరైన దానికంటే అదనంగా నలుగురు పోలీసులను ఎందుకు మోహరించారనే దానిపై వివరణ కోరుతూ శర్మ నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
భగ్గుమన్న టీఎంసీ
ఈ సంఘటనతో బెంగాల్‌లో తీవ్ర రాజకీయ వివాదం చెలరేగింది. శర్మ చర్యలను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా స్వాగతిస్తూ.. ‘బెదిరింపుల శకం ముగిసింది, చట్టం తనపని తాను చేసుకుపోతుంది’ అని అన్నారు. మరోవైపు టీఎంసీ తీవ్రస్థాయిలో మండిపడింది. వివాదాస్పద ఎన్‌కౌంటర్లతో పేరుగాంచిన అధికారిని ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ నియమించిందని, ఆయన నిష్పాక్షికతపై అనుమానాలున్నాయని విమర్శించింది.
ఇది కూడా చదవండి: Indonesia: ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి


