Indonesia: ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి | Deadly Train Collision Near Jakarta Kills 7, Over 80 Injured In Indonesia, Watch Videos Inside | Sakshi
Sakshi News home page

Indonesia: ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి

Apr 28 2026 8:29 AM | Updated on Apr 28 2026 11:02 AM

Jakarta Train Tragedy 7 Dead as Trains Collide

జకార్తా: ఇండోనేషియా రాజధాని జకార్తా శివార్లలోని బెకాసి ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న కమ్యూటర్ రైలును వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో ఎక్స్‌ప్రెస్ రైలు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 81 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు.

కారు రూపంలో ముంచుకొచ్చిన ప్రమాదం
ఈ ఘోర ప్రమాదానికి ఓ టాక్సీ ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. రైల్వే అధికారి ఫ్రానోటో విబోవో తెలిపిన వివరాల ప్రకారం... లెవల్ క్రాసింగ్ వద్ద ఓ టాక్సీ.. కమ్యూటర్ రైలును ఢీకొట్టడంతో ఆ రైలు ట్రాక్ పైనే నిలిచిపోయింది. సరిగ్గా అదే సమయానికి ట్రాక్ పై వేగంగా దూసుకొచ్చిన రైలు.. ఆగి ఉన్న కమ్యూటర్ రైలును వెనుక నుంచి ఢీకొంది. మహిళల కోసం కేటాయించిన చివరి బోగీ తునాతునకలయ్యింది. ఈ  రైలు ప్రమాదం నుంచి 240 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

క్షణాల్లో ముగిసిన జీవితాలు
‘అంతా రెప్పపాటులో జరిగిపోయింది’ అని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 29 ఏళ్ల సౌసన్ సరిఫా అనే బాధితురాలు మీడియాకు తెలిపారు. బెకాసి తైమూర్ స్టేషన్‌లో రైలు దిగేందుకు ప్రయాణికులు సిద్ధమవుతుండగా, ఒక్కసారిగా భారీ శబ్దంతో వెనుక నుంచి మరో రైలు ఢీకొట్టిందని ఆమె వివరించారు. తప్పించుకునే సమయం లేకపోవడంతో ప్రయాణికులంతా ఒకరిపై ఒకరు పడిపోయారని, ఊపిరి ఆడక కిందన ఉన్న వారు మరణించి ఉండొచ్చని అన్నారు.. తాను పైభాగంలో ఉండటం వల్లే  ప్రాణాలతో బయటపడ్డానని ఆమె తెలిపారు.

శిథిలాల మధ్య ప్రాణాల కోసం పోరాటం
ప్రమాద స్థలంలో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. నుజ్జునుజ్జయిన బోగీల మధ్య ఇద్దరు వ్యక్తులు ఇంకా ప్రాణాలతో చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు.  బోగీని ప్రత్యేక పరికరాల సాయంతో కత్తిరించి, బాధితులను రక్షించేందుకు మిలిటరీ, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, అగ్నిమాపక సిబ్బంది, రెడ్‌క్రాస్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇండోనేషియా రైల్వేలో నిర్వహణ లోపం వల్లే తరచుగా ఇలాంటి ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement