దుబాయ్‌ విడిచి.. విజయ్‌ వెంట నడిచి.. | Who is Nayeem Moosa Meet Mystery NRI Businessman Behind Vijays Security | Sakshi
Sakshi News home page

దుబాయ్‌ విడిచి.. విజయ్‌ వెంట నడిచి..

May 12 2026 3:11 AM | Updated on May 12 2026 5:21 AM

Who is Nayeem Moosa Meet Mystery NRI Businessman Behind Vijays Security

వెండితెరపై ‘దళపతి’గా వెలిగిన విజయ్, ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి. అయితే ‘తమిళక వెట్రి కజగం’ (టీవీకే) సారథిగా రాజకీయ క్షేత్రంలో కదం తొక్కిన విజయ్ ఎక్కడికి వెళ్లినా, ఏ బహిరంగ సభలో పాల్గొన్నా ఆయన పక్కనే నలుపు రంగు దుస్తుల్లో నిశితంగా గమనిస్తూ కనిపించే ఒక ‘మిస్టరీ మ్యాన్’ ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్. ఆయనే నయీమ్ మూసా. దుబాయ్‌లో భారీ వ్యాపార సామ్రాజ్యం ఉన్నప్పటికీ, కేవలం స్నేహం కోసం విజయ్ రక్షణ వలయాన్ని పర్యవేక్షిస్తున్న ఈ మలయాళీ పారిశ్రామికవేత్త ప్రయాణం ఒక సినిమా కథను తలపిస్తోంది.

మాహే నుంచి దుబాయ్ వరకు..
పుదుచ్చేరి పరిధిలోని మాహేలో జన్మించిన నయీమ్ మూసాకు చిన్నప్పటి నుంచే ఫిట్‌నెస్, బాడీబిల్డింగ్‌పై మక్కువ ఎక్కువ. ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లిన ఆయన, అక్కడ కఠిన శ్రమతో తన శరీరాకృతిని మలచుకున్నారు. ఒక చిన్న సెక్యూరిటీ అసైన్‌మెంట్‌తో ప్రారంభమైన ఆయన ప్రస్థానం, నేడు గల్ఫ్ దేశాల్లోనే ప్రముఖ భద్రతా సంస్థ అయిన ‘జెండర్ సెక్యూరిటీ’ స్థాపనకు దారితీసింది.

గ్లోబల్ స్టార్లకు రక్షణ కవచం
నయీమ్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. పాప్ సింగర్ జస్టిన్ బీబర్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ వంటి హేమాహేమీలు దుబాయ్ వెళ్తే వారి భద్రత బాధ్యత నయీమ్‌దే. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ వంటి భారీ క్రీడా వేడుకలకు యూఏఈ ప్రభుత్వం అధికారికంగా నయీమ్ ఏజెన్సీకే భద్రతా ఏర్పాట్లు అప్పగిస్తుంటుంది. ప్రస్తుతం తన వ్యాపారాన్ని భారత్‌కు విస్తరించి, చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆయన వ్యాపారం కోట్లలో విస్తరించి ఉన్నప్పటికీ, దాని ఖచ్చితమైన విలువ వివరాలు తెలియవు.

రాజకీయాల్లోనూ విజయ్ ‘రైట్ హ్యాండ్’
విజయ్ సినిమాల్లో ఉన్నప్పుడు కేవలం షూటింగ్‌లకే పరిమితమైన నయీమ్, టీవీకే స్థాపన తర్వాత విజయ్‌కు అనివార్య వ్యక్తిగా మారారు. ‘నయీమ్ నా వెంట ఉన్నంత కాలం నా భద్రత గురించి నాకు చింత లేదు’ అని విజయ్ స్వయంగా పేర్కొనడం వారి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనం.

ముఖ్యమంత్రి కాకముందు ప్రభుత్వం విజయ్‌కు 'వై' కేటగిరీ భద్రత కల్పించిప్పటికీ, వ్యక్తిగతంగా నయీమ్ ఏర్పాటు చేసే రక్షణ వలయంపైనే దళపతికి గురి. తమిళనాడు రాజకీయ సభల కోసం కేరళ నుంచి ప్రత్యేకంగా శిక్షణ పొందిన నిపుణులను నయీమ్ రప్పిస్తుంటారు. ఆధునిక సాంకేతికతను, కట్టుదిట్టమైన క్రమశిక్షణను కలగలిపి ఆయన రూపొందించే భద్రతా వ్యూహాలు అజేయమైనవి. ఆడంబరాలకు దూరంగా, మీడియా వెలుగులోకి రాకుండా కేవలం తన క్లయింట్ భద్రత, గోప్యతకే నయీమ్ ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement