
కరూర్: కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణకు తమిళనాడు ప్రభుత్వం జస్టిస్ అరుణ జగదీశన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిషన్‌ను నియమించింది. గతంలో జస్టిస్ అరుణ జగదీశన్ ఇలాంటి సున్నితమైన పలు కేసులను సమర్థవంతంగా విచారణ చేశారు. జస్టిస్ అరుణ జగదీశన్.. మద్రాస్ హైకోర్టులో రిటైర్డ్ న్యాయమూర్తి . ఆమె తమిళనాడులో పలు ఉన్నతస్థాయి విచారణ కమిషన్లకు సారధ్యం వహించారు. 2009 నుండి 2015లో పదవీ విరమణ చేసే వరకు మద్రాస్ హైకోర్టులో జడ్జిగా ఆమె విధులు నిర్వహించారు.
కరూర్‌లో టీవీకె పార్టీ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో దాదాపు 100 మంది వరకూ గాయపడ్డారు. ఈ సందర్భంగా తమిళనాడు డీజీపీ వెంకటరామన్ మాట్లాడుతూ ఊహించనంత సంఖ్యలో ప్రజలు తరలిరావడం వల్లే తొక్కిసలాట ఘటన జరిగిందన్నారు. ర్యాలీ కోసం 500 మంది పోలీసు సిబ్బందిని మోహరించామని తెలిపారు.
ఈ ఘటనపై స్టాలిన్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌తో విచారణకు ఆదేశించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితతోపాటు ఆమె సహచరులపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసును జస్టిస్ అరుణ విచారించారు. జస్టిస్ అరుణ హైకోర్టులో పని చేస్తున్నప్పుడు ఓ కేసులో చెన్నై పోలీసులకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఫిబ్రవరి 2015లో పోలీసు ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మృతిచెందారు. వారంతా బ్యాంకును దోచుకున్నారనే ఆరోపణలు వినిపించాయి. పలువురు దీనిని నకిలీ ఎన్‌కౌంటర్ అని ఆరోపించారు. ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది.
ఆ సమయంలో పోలీసులకు జస్టిస్ అరుణ బెంచ్ క్లీన్‌చిట్ ఇచ్చింది. 2018లో తమిళనాడులోని టుటికోరిన్‌లో స్టెర్లైట్ పరిశ్రమకు నిరసన సెగ తగిలి హింస చెలరేగింది. పోలీసులు.. నిరసన కారులను చెదరగొట్టేందుకు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 13 మంది మృతిచెందారు. ఈ కేసును దర్యాప్తు చేసే బాధ్యతను అప్పటి ప్రభుత్వం జస్టిస్ అరుణ్‌కు అప్పగించింది .ఈ నేపధ్యంలో ఓ ఐపీఎస్ అధికారితో సహా 17 మంది పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె నేతృత్వంలోని కమిషన్ సిఫార్సు చేంది. 2002లో ఓ దళిత మహిళ కస్టోడియల్ మరణం కేసులో నూ ఆమె సంచలన తీర్పు ఇచ్చారు. బాధితురాలిపై ప్రలలో సానుభూతి ఉన్నప్పటికీ, తగిన ఆధారాలు లేకపోవడంతో దిగువ కోర్టు విధించిన శిక్షను రద్దు చేశారు. ఎనిమిది మంది పోలీసులను నిర్దోషులుగా ప్రకటించారు.