రెండో దశలోనూ రికార్డ్‌ స్థాయిలో | West Bengal Election 2026 Total turnout climbs to 92. 49percent | Sakshi
Sakshi News home page

రెండో దశలోనూ రికార్డ్‌ స్థాయిలో

Apr 30 2026 5:24 AM | Updated on Apr 30 2026 5:24 AM

West Bengal Election 2026 Total turnout climbs to 92. 49percent

ప్రశాంతంగా ముగిసిన 

పశ్చిమబెంగాల్‌ రెండో దశ పోలింగ్‌

92.48 శాతం ఓటింగ్‌ నమోదు

తొలి, మలి దశలు కలిపి మొత్తంగా 92.84 శాతం పోలింగ్‌ నమోదు

కోల్‌కతా: బీజేపీ, టీఎంసీ ముఖ్యనేతల హోరాహోరీ ప్రచారపర్వం తర్వాత బుధవారం పశ్చిమబెంగాల్‌ శాసనసభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. బుధవారం రాత్రి 7.45 గంటలకు అందిన సమాచారం మేరకు రెండో దఫాలో రికార్డ్‌ స్థాయిలో 92.48 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ సమయం ముగిసేనాటికి క్యూ వరసల్లో నిల్చున్న వాళ్లకు సైతం ఓటేసే అవకాశం కల్పించారు. దీంతో పోలింగ్‌ శాతం పెరిగే వీలుంది. 

తొలి దశలో 93.19 శాతం పోలింగ్‌ నమోదైన విషయం తెల్సిందే. మొదటి, రెండో దశ పోలింగ్‌ శాతాలను కలుపుకుంటే సగటును 92.84 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇది రాష్ట్రచరిత్రలోనే అత్యధిక ఓటింగ్‌ శాతమని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో 2011లో 84.72 శాతం పోలింగ్‌ నమోదైంది. బుధవారం రెండో దశలో 142 స్థానాలకుగాను బుధవారం 40వేలకుపైగా పోలింగ్‌ స్టేషన్లలో ఓటర్లు బారులు తీరి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పూర్బ బర్ధమాన్‌ జిల్లాలో అత్యధికంగా 93.78 శాతం పోలింగ్‌ నమోదైంది. రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో 88.59 శాతం పోలింగ్‌ నమోదైంది. 

భవానీపూర్‌ నుంచి పోటీచేస్తున్న 71 ఏళ్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఉదయం నియోజకవర్గంలోని చక్రబేరియా ప్రాంతంలోని 70వ నంబర్‌ వార్డ్‌లో పోలింగ్‌కేంద్రంలో ఓటేసి బయటికొచ్చి కూర్చున్నారు. అదే సమయానికి మమతపై పోటీకి దిగిన బీజేపీ రాష్ట్ర ముఖ్యనేత సువేంధు అధికారి అక్కడికి వచ్చారు. కానీ ఇద్దరి మధ్యా ఎలాంటి సంభాషణ జరగలేదు. ఈమెకు ఒక్కరు కూడా ఓటేయబోరు అని సువేంధు వ్యాఖ్యానించారు. 

పానీహటిలో బీజేపీ మహిళా అభ్యర్థి, ఆర్జీకర్‌ బోధనాస్పత్రిలో హత్యోదంతంలో బాధిత వైద్యురాలి తల్లి రత్నా దేభ్‌నాథ్‌ కారును టీఎంసీ కార్యకర్తలు అడ్డుకుని నిరసనతెలిపారు. బసంతిలో తమ కారును టీఎంసీ గూండాలు అడ్డుకుని డ్రైవర్‌ను కొట్టారని బీజేపీ అభ్యర్థి బికాశ్‌ సర్దార్‌ ఆరోపించారు. మరోవైపు పోలింగ్‌ కేంద్రాల వద్ద సీఆర్‌పీఎఫ్‌జవాన్లు గూండాల్లా ప్రవర్తిస్తూ మహిళా ఓటర్ల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని టీఎంసీ ఆరోపించింది. హౌరాలోని సథాఛియాలో నాలుగేళ్ల పిల్లాడిని, ఆమె తల్లిని క్యూవరసలో సరిగా నిల్చోలేదని సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు విచక్షణారహితంగా కొట్టారని టీఎంసీ ఆరోపించింది.

Advertisement
 
Advertisement
Advertisement