కోల్‌కతా: తృణముల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకీ మరో ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లి దాడికి గురైన ఘటన గడిచి 24 గంటలు గడవకముందే ఇప్పుడు మరో కేసులో ఇరుకున్నారు. నకీలీ సంతకాల విచారణలో విచారణకు రావాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది.
పశ్చిమ బెంగాల్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID), తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి (శనివారం) సమన్లు జారీ చేసింది. 'నకిలీ సంతకాల' వివాదానికి సంబంధించిన విచారణలో భాగంగా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కోల్‌కతాలోని భవానీ భవన్ సిఐడి ప్రధాన కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని అభిషేక్ బెనర్జీకి ఆదేశాలు జారీ చేసింది.
కేసు వివరాలు
అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా శోభన్‌దేబ్ చటోపాధ్యాయను ఎన్నుకుంటూ సుమారు 70 మంది టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు లేఖను అభిషేక్ బెనర్జిీ మే 19న అసెంబ్లీ సెక్రటేరియట్‌కు సమర్పించారు. అయితే, ఈ లేఖలోని కొన్ని సంతకాలు అసెంబ్లీ రికార్డులతో సరిపోలలేదు. ముఖ్యంగా టీఎంసీ ఎమ్మెల్యే నైనా బెనర్జీ సంతకం ఫోర్జరీ అయిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై అసెంబ్లీ సెక్రటేరియట్ కోల్‌కతాలోని హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఈ కేసు విచారణను సిఐడి (CID) స్వీకరించి, ఇప్పటికే పలువురు టీఎంసీ ఎమ్మెల్యేలను విచారించింది. అదే సమయంలో అభిషేక్ బెనర్జీ ఐదుగురు సీఐడీ అధికారుల బృందం ముఖర్జీ రోడ్డులోని అభిషేక్ బెనర్జీ నివాసానికి వెళ్లారు. ఆయన అక్కడ లేకపోవడంతో వెనుతిరిగారు. ఈ నేపథ్యంలోనే తృణముల్ కార్యకర్తలను పరామర్శించడానికి అభిషేక్ వచ్చిన సమయంలో ఆయనను స్వయంగా కలిసి నోటీసులు అందజేశారు.
అభిషేక్ స్పందన
అయితే నోటీసులు అందుకున్న అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. "నేను ఇంకా నోటీసు లోపల ఏముందో పూర్తిగా చూడలేదు. నా న్యాయవాదులతో మాట్లాడి తగిన విధంగా స్పందిస్తాను. విచారణకు ఖచ్చితంగా సహకరిస్తాను, అవసరమైతే అధికారుల ముందుకు హాజరవుతాను. అని అన్నారు.


