
న్యూఢిల్లీ: దేశంలో ఓట్ల చోరీపై తమ ఆందోళన అనేది కేవలం రాజకీయ అంశం కాదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తే ల్చిచెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ‘ఒక్కరికి ఒక ఓటు’అనే విధానాన్ని కాపాడుకొనేందుకు జరుగుతున్న నిర్ణయాత్మక పోరాటం అని స్పష్టంచేశారు. ‘ఓటర్ అధికార్ యాత్ర’ద్వారా ఓట్ల చోరీపై బిహార్ గడ్డపైనుంచే ప్రత్యక్ష యుద్ధం ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. ఈ మేరకు రాహుల్ గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు.
దేశవ్యాప్తంగా స్వేచ్ఛమైన, స్పష్టమైన ఓటర్ల జాబితా కోసం తమ పార్టీ పోరాడుతోందని ఉద్ఘాటించారు. ఈ నెల 17వ తేదీ నుంచి ఓటర్ అధికార్ యాత్ర ప్రారంభమవుతుందని, యువత, కార్మికులు, రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇదొ క ప్రజా ఉద్యమం అని పేర్కొన్నారు. ఓట్ల దొంగల ను ఎన్నికల్లో ఓడించాలని విజ్ఞప్తి చేశారు. ఓట్ల చోరు లు ఓడిపోతేనే ప్రజలకు, రాజ్యాంగానికి విజయం లభిస్తుందన్నారు. ఓటర్ అధికార్ యాత్రకు సంబంధించిన ఓ వీడియోను రాహుల్ గాంధీ సోషల్ మీడియాను షేర్ చేశారు.