బెంగాల్‌లో బీజేపీ ఎఫెక్ట్‌.. ఈ దృశ్యాలు చూశారా? | West Bengal Cracks Down On Illegal Immigration With Detect, Delete, Deport Drive Amid Border Tensions, Watch Inside | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో బీజేపీ ఎఫెక్ట్‌.. ఈ దృశ్యాలు చూశారా?

May 27 2026 10:16 AM | Updated on May 27 2026 10:30 AM

Viral: Illegal Migration Wave Sparks Unrest Across Bengal Border Regions

ఓ చేతిలో తట్టా బుట్టలు, భుజాన మూటలు… మరో చేతిలో పిల్లల చెయ్యి పట్టుకుని సరిహద్దుల వైపు నడక. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళన ముఖంలో.. హకీంపూర్ చెక్‌పోస్ట్ నుంచి మాల్దా వరకు పశ్చిమ బెంగాల్‌ అంతటా ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యాలు ఇవే. ఒకప్పుడు రాజకీయ చర్చలకే పరిమితమైన అక్రమ వలసదారుల అంశం ఇప్పుడు క్షేత్రస్థాయిలో కనిపించే పరిణామాలుగా మారడంతో సరిహద్దులో అసాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.. 

అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై కఠిన వైఖరి అవలంబిస్తామని బెంగాల్‌లో బీజేపీ మొదటి నుంచి ప్రచారం చేసుకుంటోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సువేందు అధికారి కూడా గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇదే విషయాన్ని పదేపదే చెబుతూ వచ్చారు. అయితే.. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రాగానే దానిని కార్యరూపంలోకి తీసుకొచ్చారనే చర్చ జోరందుకుంది. 

బెంగాల్‌లో అక్రమ వలసదారుల ఎరివేతకు “డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్”.. విధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి సువేందు అధికారి స్పష్టం చేశారు. తాజాగా సీనియర్ బీఎస్‌ఎఫ్‌ అధికారులతో జరిగిన మీటింగ్‌లోనూ ఆయన ఈ విషయాన్ని ధృవీకరించారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA) పరిధిలో లేని వారిని అక్రమంగా దేశంలోకి వచ్చినవారిగానే పరిగణిస్తామని..  అలాంటి వాళ్లను స్థానిక పోలీసులు సాయంతో అదుపులోకి తీసుకుని బీఎస్‌ఎఫ్‌కు అప్పగిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అంటే అటు నుంచి అటే వాళ్లను దేశం నుంచి పంపించేస్తారన్నమాట. ఈ వ్యాఖ్యలు బెంగాల్‌లో అలజడిని రేపాయి. అందుకు తగ్గట్లే.. ‍ప్రవాహం కనిపిస్తోంది. 

 

హకీంపూర్ చెక్‌పోస్ట్ సహా ఉత్తర 24 పరగణాలు, మాల్దా ప్రాంతాల్లో అనుమానితుల కదలికలు పెరిగినట్లు స్థానిక నివేదికలు పేర్కొంటున్నాయి. ఒక్క హకీంపూర్ వద్దే ఒకే రోజులో వంద మందికి పైగా గుమిగూడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వీరిలో కొందరు బంగ్లాదేశ్ వైపు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో మాల్దాలో కూడా ఇదే తరహా కదలికలు కనిపించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

ఇక కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా హోం & హిల్ అఫైర్స్ శాఖలోని ఫారినర్స్ బ్రాంచ్ తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో మాల్దా జిల్లాలో మొదటిసారిగా “హోల్డింగ్ సెంటర్” ఏర్పాటు చేసి అమలు చేస్తున్నారు. భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులు, రోహింగ్యాలపై చేపట్టే చర్యల భాగంగా ఈ వ్యవస్థను వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

బెంగాల్‌ ప్రభుత్వం ఇప్పటికే సరిహద్దు జిల్లాల్లో గుర్తింపు, నిర్బంధం, బహిష్కరణ ప్రక్రియలను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న హోల్డింగ్ సెంటర్లలో అనుమానితులను తాత్కాలికంగా ఉంచి వారి బయోమెట్రిక్ వివరాలు, పత్రాలు, నేపథ్యాన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మాల్దా కేంద్రంలో పలువురు అనుమానితులు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత, సీసీటీవీ పర్యవేక్షణ కొనసాగుతోంది.

ఇటీవల అమల్లోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్ మరియు ఫారినర్స్ చట్టం బెంగాల్‌ బీజేపీ ప్రభుత్వం చేపట్టిన డ్రైవ్‌కు మరింత బలం ఇచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ చట్టం ద్వారా వలసదారులపై నిఘా, నిర్బంధం, బహిష్కరణ ప్రక్రియలను డిజిటల్ వ్యవస్థ ద్వారా వేగవంతం చేయడంతో పాటు, హెడ్ కానిస్టేబుల్ స్థాయి అధికారులకు కూడా వారెంట్ లేకుండానే చర్యలు తీసుకునే అధికారం ఉంది.

బెంగాల్‌ అధికారుల చెబుతోంది ఏంటంటే.. ఈ హోల్డింగ్ సెంటర్లు తాత్కాలిక నిర్బంధ కేంద్రాలుగా పనిచేస్తాయి. అనుమానితుల జాతీయత నిర్ధారణ పూర్తయ్యే వరకు వారిని గరిష్టంగా 30 రోజుల వరకు అక్కడ ఉంచే అవకాశం ఉంది. జిల్లా మేజిస్ట్రేట్లు మరియు సంబంధిత అధికారులు పత్రాల ధృవీకరణ, డేటా సేకరణ, కేంద్ర డేటాబేస్‌లకు సమాచారాన్ని అప్‌లోడ్ చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నారు.

అయితే ఈ పరిణామాలు కేవలం పశ్చిమ బెంగాల్‌కే పరిమితం కాలేదంటూ సోషల్‌ మీడియా ప్రచారం ఉవ్వెత్తున నడుస్తోంది. పలు రాష్ట్రాల్లోనూ(తెలుగు రాష్ట్రాల్లోనూ) బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద అక్రమ వలసల కదలికల సంకేతాలు కనిపిస్తున్నాయట. కొందరు ఈ పరిణామాలపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ.. తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరుతున్నారు. అదే సమయంలో కుటుంబాలతో కలిసి తాత్కాలికంగా ప్రయాణిస్తున్న వర్గాల సంఖ్య పెరుగుతుండటంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement