ఆ విషయం తేలకుండానే ప్రభుత్వ ఏర్పాటా? షిండేపై మళ్లీ కోర్టుకెక్కిన థాక్రే వర్గం

Uddhav Thackeray Team Fresh Challenge in Supreme Court Against Eknath Shinde Government - Sakshi

ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్ధవ్ థాక్రే  శివసేన వర్గం సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. గవర్నర్ భగత్‌ సింగ్ కోష్యారి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని షిండేను ఆహ్వానించడాన్ని పిటిషన్‌ ద్వారా సవాల్ చేసింది.

పదహారు మంది రెబల్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ విషయంపై ఎటూ తేలకుండానే అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించారని, స్పీకర్ ఎన్నిక ఓటింగ్‌లోనూ వారంతా పాల్గొన్నారని కోర్టుకు తెలిపింది. ఉద్ధవ్ థాక్రే వర్గం ప్రతినిధి సుభాష్ దేశాయ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.  పదహారు మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత విషయంపై తీర్పు చెప్పాలని థాక్రే వర్గం సుప్రీంకోర్టును కోరింది. వీరు ఓటింగ్‌లో పాల్గొన్న నూతన స్పీకర్‌ రాహుల్ నర్వేకర్‌పై తాము అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పింది. సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది.

మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేసి భాజపా మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు సీఎం ఏక్‌నాథ్ షిండే. జూన్ 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఆ తర్వాత అసెంబ్లీలో సోమవారం జరిగిన బలపరీక్షలో 166 ఓట్లతో షిండే మెజారిటీ నిరూపించుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా 99 ఓట్లే వచ్చాయి.

షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక థాక్రే వర్గం మరింత బలహీనపడుతోంది. శివసేన నాయకులు, కార్పొరేటర్లు అధికారికంగా షిండే వర్గంలో చేరుతున్నారు.  దీంతో అసలైన శివసేన తమదేనని షిండే వర్గం వాదిస్తోంది.

థాక్రేతో ప్యాచప్‌కు సిద్ధం
మరోవైపు ఉద్ధవ్ థాక్రే  తిరిగి తమతో కలవాలనుకుంటే పార్టీలో చీలక ఉండదని షిండే వర్గం ఆఫర్‌ ఇచ్చింది. తమతో పాటు బీజేపీ కూడా ఉందని, మునుపటిలా కలిసిముందుకాసాగుదామని ఆఫర్ ఇచ్చింది. అయితే ఇందుకు థాక్రే బీజేపీ నేతలను కలిసి మాట్లాడాలని సూచించింది.
చదవండి: అధికారం పోయింది, మరి పార్టీ?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top