ఆ సినిమా సీన్‌ను రిపీట్‌ చేస్తున్న విజయ్‌! | TVK Vijay Recreated The Sarkar Movie climax Scene After Exit Polls Ahead Of Tamil Nadu Election Results | Sakshi
Sakshi News home page

ఆ సినిమా సీన్‌ను రిపీట్‌ చేస్తున్న విజయ్‌!

Apr 30 2026 10:38 AM | Updated on Apr 30 2026 10:56 AM

TVK Vijay recreated the Sarkar climax Scene After Exit Polls

కొన్ని దశాబ్దాల తమిళనాడు రాజకీయలు డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య ద్విముఖ పోరాటంగా కొనసాగుతూ వచ్చాయి. మధ్యలో ప్రత్యామ్నాయంగా పార్టీలు పుట్టుకొచ్చినా.. అవి దీర్ఘకాలం ప్రభావం చూపెట్టలేకపోయాయి.  కానీ ఈసారి ఆ సీన్‌లోకి అగ్రనటుడు విజయ్‌ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ప్రభంజనంలా దూసుకొచ్చింది. 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన విడుదల కాబోతున్నాయి. ఈలోపు.. ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు ఆసక్తికరమైన చర్చకు దారి తీశాయి. మెజారిటీ డీఎంకేకే తమిళ ఓటర్లు మళ్లీ పట్టం కడతారని తేల్చేశాయి. ఒకట్రెండు మాత్రం ప్రతిపక్ష అన్నాడీఎంకేకు అధికారం ఖాయమన్నాయి. అయితే ఆ సర్వేలే విజయ్‌ టీవీకే పార్టీ రెండంకెల ఫిగర్‌కు పరిమితం కావొచ్చని చెబుతూనే.. ఓటింగ్‌ శాతంపరంగా ఇంపాక్ట్‌ చూపించవచ్చని అంచనా వేశాయి. అయితే.. 

యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ మాత్రం అనూహ్యంగా విజయ్‌ టీవీకే అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోతోందని పేర్కొంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే పార్టీ 98-120 మధ్య సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ సంఖ్య సాధారణ మెజారిటీకి మించి ఉండటంతో.. విజయ్‌ ముఖ్యమంత్రి పదవి వైపు దూసుకెళ్తున్నారని యాక్సిస్ మై ఇండియా ఛైర్‌పర్సన్ ప్రదీప్ గుప్తా వ్యాఖ్యానించారు.

దీంతో విజయ్‌ అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. అయితే విజయ్‌ మాత్రం తొందరపాటు వద్దని.. సంయమనం పాటించాలని కేడర్‌కు, అభిమానులకు సూచిస్తున్నారు. పోలింగ్‌ తర్వాత ఇంటికే పరిమితమైన ఆయన.. ఫలితాలు దగ్గర పడుతున్నా కొద్దీ వరుసగా ప్రముఖ ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇవాళ టీవీకే తరఫున పోటీ చేసిన 234 మంది అభ్యర్థులతోనూ ఆయన భేటీ కానున్నారు. 

మురుగదాస్‌ డైరెక్షన్‌లో విజయ్‌ హీరోగా సర్కార్‌ అనే పొలిటికల్‌ డ్రామా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఓటు వాల్యూ ఏంటో చెప్పే మెసేజ్‌తో తెరకెక్కిందా చిత్రం. సినిమా క్లైమాక్స్‌లో..  తన తరఫున గెలిచిన వాళ్లతో ఓ మీటింగ్‌ పెట్టి సీఎం క్యాండిడేట్‌ను అనౌన్స్‌ చేస్తాడు విజయ్‌. ఈ నేపథ్యంలో నెట్టింట ఇవాళ్టి టీవీకే మీటింగ్‌పైనా అలాంటి పోలికతో చర్చ నడుస్తోంది. అయితే.. ఫలితాల తర్వాత ఎలా వ్యవహరించాలన్నదానిపై అభ్యర్థులకు విజయ్‌ దిశానిర్దేశం చేస్తారని టీవీకే వర్గాలు చెబుతున్నాయి. 

మరోవైపు రాజకీయ ప్రత్యర్థులు ఈ మీటింగ్‌పై సెటైర్లు పేలుస్తున్నారు. టీవీకే ఇప్పటికే విజయ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీఎం కేండిడేట్‌ను కొంపదీసి విజయ్‌ మారుస్తారా? ఏంటి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తు‍న్నాయి. 

తమిళ దర్శకనిర్మాత ఎస్‌ఏ చంద్రశేఖర్‌ తనయుడిగా వెట్రి(1984) అనే మూవీతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా జోసెఫ్‌ విజయ్‌ వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆపై 18 ఏళ్ల వయసులో నాళఇయా తీర్పు(1992)తో హీరోగా మారాడు. రొమాంటిక్‌, మాస్‌ ఇమేజ్‌లతో అగ్రతారగా ఎదిగారు. ఒక పక్క మెసేజ్‌ ఓరియెంటల్‌ సినిమాలు వరుసగా తీస్తూనే.. మరోవైపు తన అభిమాన సంఘాల ద్వారా సామాజిక సేవతో గుర్తింపు దక్కించుకున్నారు. ఈ మధ్యలో తమిళనాడులో జరిగిన ప్రతీ పోరాటానికి, ఉద్యమానికి పార్టీలకతీతంగా ఆయన బహిరంగంగా మద్దతు ప్రకటించారు. 

అటుపై ఏకంగా తమిళగ వెట్రి కగళం పార్టీని స్థాపించి దేశ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నికల ప్రచారం దాకా.. విజయ్‌ అనుసరించిన వ్యూహం తమిళ ప్రజలను మరీ ముఖ్యంగా యువతను ఎక్కువగా ఆకట్టుకుంది. ఎవరితోనూ పొత్తు ఉండదని.. ఒంటరి పోరుకే సై అంటూ హాట్‌ చర్చకు దారి తీశారాయన. బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా.. డీఎంకేను రాజకీయ శత్రువుగా అభివర్ణించుకుంటూ మధ్యలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకు సాగారు. ఒకానొక దశలో.. తమిళనాట మార్పు టీవీకేతోనే సాధ్యం అనే పిలుపుపై జోరుగా చర్చ నడిచింది. అయితే ఎంజీఆర్‌, జయలలితలా.. విజయ్‌ మరో తమిళ రాజకీయాలను శాసించే సినీ తార అవుతారా? లేదా? అనేది ఫలితాలు వెల్లడయ్యేదాకా సస్పెన్స్‌గానే భావించాలి.

Advertisement
 
Advertisement
Advertisement