సాక్షి, చెన్నై: తమిళనాడు పారిశ్రామిక రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన ఎంచుకున్న సరికొత్త డిజిటల్ పద్ధతి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, త్వరితగతిన లభించే అనుమతులపై ఆమె ఇన్‌స్ట్రాగామ్ ’రీల్స్’ రూపంలో ఒక వీడియోను విడుదల చేశారు. దీనిపై నెటిజన్ల నుండి ఒకవైపు భారీగా ప్రశంసలు దక్కుతుండగా, మరోవైపు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రజల్ని రీల్స్ , డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్‌ల వేదికగా ఆకర్షించిందన్నది జగమెరిగిన సత్యం. తాజాగా అధికారంలోకి వచ్చినానంతరం కూడా రీల్స్ హోరెతుత్తుతున్నాయి. ఈ పరిస్థితులలో మంత్రి మంత్రి కీర్తన తన రీల్స్ వీడియోలో ‘తమిళనాడు భవిష్యత్తు కోసం ఎదురుచూడటం లేదు.. ఆ భవిష్యత్తును మనమే స్వయంగా నిర్మిస్తున్నాం. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, ఫైళ్లు , అనుమతుల కోసం నెలల తరబడి వేచి ఉండే పాత పద్ధతులను ఎవరూ ఇష్టపడరు.
ఆ లోపాన్ని సరిదిద్ది, వ్యవస్థను వేగవంతం చేయడానికే సీఎం విజయ్ తనను ఈ స్థానంలో నియమించారు’ అని వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం కేవలం 21 రోజుల్లోనే అత్యంత వేగంగా సింగిల్ విండో ద్వారా అన్ని రకాల పారిశ్రామిక అనుమతులను ఇచ్చేందుకు కట్టుబడి ఉందని ప్రకటలించారు. ఇలా అనేక అంశాలను ప్రస్తావిస్తూ తమిళనాడులో పెట్టు బడులు పెట్టండి‘ అని ఆమె ఆ వీడియోలో పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలోనే ’రీల్స్’ , చిన్న చిన్న వీడియోల ద్వారా ప్రజలను ఆకట్టుకుని గుర్తింపు తెచ్చుకున్న కీర్తన, ఇప్పుడు మంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా పెట్టుబడులను ఆకర్షించడానికి అదే సోషల్ మీడియా వ్యూహాన్ని అమలు చేయడం గమనార్హం. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా యువతను, ఆధునిక పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునేలా సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో మంత్రి రీల్స్ చేయడం అభినందనీయమని, ఇది పారదర్శకతను పెంచుతుందని ఒక వర్గం మద్దతు తెలుపుతోంది. అదే సమయంలో అంతర్జాతీయ , దేశీయ దిగ్గజ సంస్థల నుండి కోట్లాది రూపాయల పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు అధికారిక సమావేశాలు కాకుండా, ఇలా ’రీల్స్’ ద్వారా పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసం? ఇది ప్రభుత్వ సీరియస్‌నెస్‌ను తగ్గిస్తుందంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, ఒక మంత్రి పారిశ్రామిక విధానాలను వివరించడానికి రీల్స్ రూపంలో ముందుకు రావడం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్‌కు తెరలేపినట్లైంది.


