విజ‌య్ ఇంపాక్ట్‌.. డీఎంకే, అన్నాడీఎంకే లేకుండానే పోటీ | Tamil Nadu Polls: 21 constituencies with out DMK, AIADMK Symbols | Sakshi
Sakshi News home page

21 స్థానాల్లో కాన‌రాని డీఎంకే, అన్నాడీఎంకే గుర్తులు

Apr 2 2026 8:04 PM | Updated on Apr 2 2026 8:10 PM

Tamil Nadu Polls: 21 constituencies with out DMK, AIADMK Symbols

చెన్నై: త‌మిళ‌నాడు శాస‌నస‌భ ఎన్నికల పోలింగ్‌కు మ‌రికొద్ది రోజుల స‌మ‌యం మాత్రమే ఉండడంతో ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు ముమ్మ‌రంగా ఎన్నిక‌ల ప్ర‌చారం సాగిస్తున్నాయి. ఆయ పార్టీల అగ్ర‌నేత‌లు నామినేష‌న్లు దాఖ‌లు చేసి ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. డీఎంకే-కాంగ్రెస్‌, అన్నాడీఎంకే-బీజేపీ కూట‌ముల మ‌ధ్య హోరాహోరీ త‌ప్ప‌ద‌ని ప్రిపోల్ స‌ర్వేలు చెబుతున్నాయి. మ‌రోవైపు హీరో విజ‌య్ నాయ‌క‌త్వంలోని త‌మిళ‌గ వెట్రి క‌ళ‌గం(టీవీకే) మొదటిసారి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచింది. సీమాన్ పార్టీ నామ్ త‌మిళ‌ర్ క‌చ్చి (ఎన్‌టీకే) కూడా ఒంట‌రిగా పోటీ చేస్తోంది. దీంతో ఈసారి గెలిచే అభ్య‌ర్థులకు భారీగా ఆధిక్యాలు రాక‌పోవ‌చ్చ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

పోటీ ఎక్కువ ఉండ‌డంతో ప్ర‌ధాన పార్టీలు చిన్న‌ పార్టీల‌ను కూడా త‌మ కూట‌మిల్లో చేర్చుకున్నారు. దీంతో భాగ‌స్వామ్య పార్టీల‌కు అధికంగా సీట్లు కేటాయించాల్సి వ‌చ్చింది. ఫ‌లితంగా 21 స్థానాల్లో డీఎంకే గానీ, అన్నాడీఎంకే గానీ పోటీలో లేవు. ఈ స్థానాల్లో రెండు కూట‌ముల మిత్ర‌ప‌క్షాల అభ్య‌ర్థులు పోటీలో ఉండ‌డంతో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీ గుర్తులు లేకుండా ఎన్నిక‌లు జ‌రగ‌నున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో 11 స్థానాల్లో మాత్ర‌మే ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డింది. కానీ ఈసారి మ‌రో ప‌ది స్థానాలు జ‌త‌య్యాయి. చిన్న పార్టీల ప్రాతినిథ్యం పెర‌గ‌డంతో వాటికి సీట్ల కేటాయింపులు కూడా పెంచాల్సి వ‌చ్చింద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. డీఏంకే కూట‌మిలో 20పైగా చిన్న పార్టీలు ఉండ‌డం గ‌మ‌నార్హం.

మిత్ర‌ప‌క్షాలు బ‌లంగా ఉన్నందువ‌ల్లే ఈ 21 స్థానాల‌ను డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు వ‌దులుకోవాల్సి వ‌చ్చింద‌ని జాతీయ పార్టీల‌కు ఎన‌లిస్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్న వి. భార‌తి అభిప్రాయ‌ప‌డ్డారు. కొత్త‌గా బ‌రిలోకి దిగిన టీవీకే, ఎన్‌టీకే పార్టీలు కూడా స్థానికంగా బ‌లమున్న నేత‌ల‌కే టిక్కెట్లు ఇవాల్సి ఉంటుంద‌న్నారు. విజ‌య్ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డంతో డీఎంకే, అన్నాడీఎంకే కూట‌ముల లెక్క‌లు మారిపోయాయ‌ని సెపాల‌జిస్ట్ ఆర్‌. చంద్ర‌శేఖ‌ర‌న్ అన్నారు. గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే ఈసారి గెలిచే అభ్య‌ర్థుల‌కు పెద్ద‌గా మెజార్టీలు రాక‌పోవ‌చ్చ‌ని తెలిపారు. 

చ‌ద‌వండి: హీరో విజ‌య్ విద్యార్హ‌త‌లు ఇవే

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement