మదురై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పోలీసుస్టేషన్‌లో తండ్రి కొడుకును చిత్రహింసలకు గురి చేసి చంపిన కేసులో తొమ్మిదిమంది పోలీసులకు మరణ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
తమిళనాడు మదురై అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఈ రోజు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 2020లో తండ్రీకొడుకులైన జయరాజ్ మరియు బెన్నిక్స్ కస్టోడియల్ మరణానికి కారణమైన తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఇన్స్‌పెక్టర్ శ్రీధర్, సబ్-ఇన్స్‌పెక్టర్లు రఘు గణేష్, బాలకృష్ణన్ లతో పాటు మరో ఆరుగురు పోలీసు కానిస్టేబుళ్లకు ఉరిశిక్ష విధించారు.
ఈ సందర్భంగా కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ కేసు అత్యంత అరుదైనదిగా పేర్కొంది. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే ఇంతటి అమానుషానికి ఒడిగట్టడం దారుణమని తెలిపింది. దాదాపు 6 ఏళ్ల పాటు సాగిన ఈ విచారణలో సీబీఐ కీలక సాక్ష్యాధారాలు, ఫోరెన్సిక్ రిపోర్టులను కోర్టుకు సమర్పించింది. సమగ్ర విచారణ అనంతరం నిందితులందరికీ ఉరిశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

కేసు నేపథ్యం
2020 జూన్ నెలలో లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి షాపు తెరిచి ఉంచారనే కారణంతో జయరాం, అతని కూమారుడు బెన్నిక్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రాత్రంతా లాకప్‌లో చిత్రహింసలకు గురిచేశారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు ఇద్దరికి తీవ్రగాయాలై మరణించారు. సీబీఐ విచారణలో ఆ రాత్రంతా తండ్రీకొడుకులిద్దరినీ పోలీసులు అత్యంత క్రూరంగా శారీరక మరియు లైంగిక హింసకు గురిచేశారని తేలింది. అంతేకాకుండా పోలీసుల దెబ్బలకు బాధితులకు రక్తంవస్తే బాధితులే స్వయంగా ఆ రక్తపు మరకలను తుడిచివేసేలా పోలీసులు వారిని బలవంతం చేశారని విచారణలో వెల్లడైంది. ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.


